Hyderabad, August 26: తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి, మధ్యప్రదేశ్ మీదుగా దాని పొరుగురాష్ట్రాల వరకు బంగాళాఖాతంలో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వానలు దంచికొడుతున్నాయి. ఈరోజు, రేపు మరియు ఆగష్టు 29 వరకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.
హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల్, మహబూబాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి, జనగావ్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్‌లోని పలుచోట్ల గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, పంజాగుట్ట, బేగంపేట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల మరియు పరిసర ప్రాంతాలలో జల్లులు పడ్డాయి. ఎడతెరిపి లేని వర్షంతో ప్రధాన రహదారులపై నీరు వరదలా ప్రవహిస్తుంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను GHMC అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాబోయే రెండు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ అంచనావేసింది.
బంగాళాఖాతం నుంచి పశ్చిమ, వాతువ్య దిశగా కింది వైపుకు వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణంలో తేమ పెరిగింది. ఫలితంగా ఉక్కపోత పరిస్థితులు ఏర్పడవచ్చు.