Krishna Water Dispute: కృష్ణా నీటి వాటాపై కొలిక్కి రాని పంచాయితీ, విద్యుతుత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణకు సూచించిన కృష్ణా రివర్ బోర్డ్, ఏకపక్ష నిర్ణయం అంటూ సమావేశం నుంచి టీఎస్ అధికారుల వాకౌట్
Image used for representational purpose only | File Photo

Hyderabad, September 2: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా రివర్ బోర్డ్ బుధవారం నిర్వహించిన కీలక సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో జల ఉత్పత్తిని నిలిపివేయాలని KRMB పేర్కొనడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సమావేశం నుండి వాకౌట్ చేశారు.

నీటి వాటాలపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదు, కృష్ణా నీటిలో ఆంధ్రప్రదేశ్ 70 శాతం వాటాను డిమాండ్ చేసింది. అయితే ఇరు రాష్ట్రాలకు సమానంగా 50:50 నిష్పత్తిలో వాటా ఉండాలని తెలంగాణ వాదిస్తుంది. అయితే తెలంగాణకు 34%, ఏపి 66% వాటా తీసుకోవాలని కృష్ణా బోర్డ్ సూచించడంతో టీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా బోర్డ్ సమావేశంలో సుదీర్ఘంగా 5 గంటల పాటు ఏపి, టీఎస్ అధికార యంత్రాంగాలు తమ వాడివేడీ వాదనలు వినిపించాయి. హైడల్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి చర్చకు వచ్చినప్పుడు వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏపి యొక్క నీటిపారుదల మరియు తాగునీటి అవసరాలను తీర్చిన తర్వాత మాత్రమే తెలంగాణ విద్యుదుత్పత్తి చేసుకోవాలని, లేనిపక్షంలో నిలిపివేయాలి అంటూ ఏపి అధికారులు వాదించారు. హైడెల్ విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని టీఎస్ ప్రభుత్వాన్ని బోర్డు ఆదేశించాలని కోరారు, అయితే అలా చేసే ప్రశ్నే లేదని, శ్రీశైలం ప్రాజెక్ట్ హైడల్ ఉత్పత్తికి ఉద్దేశించినదని టీఎస్ అధికారులు వాదించారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా, టీఎస్ ప్రభుత్వం ఖరీదైన థర్మల్ విద్యుత్‌పై ఖర్చు తగ్గించడానికి చౌకైన హైడెల్ పవర్‌పై ఆధారపడాల్సి వచ్చిందని వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కూడా టీఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌లో టెలిమెట్రీల ఏర్పాటు, ఏపీ ప్రభుత్వం నీటి మళ్లింపును ఆపడంలో బోర్డు విఫలమైందని ఆయన ఆరోపించారు.

KRMB వైఖరి ఏకపక్షంగా ఉందని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయమై వీలైతే టీఎస్ సీఎం కేసీఆర్ గురువారం కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తారని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని వివరించే నివేదికను సమర్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.