Hyderabad, August 26: సెప్టెంబర్ 1 న జరగబోయే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) సమావేశానికి రాష్ట్రం తరఫున అధికార యంత్రాంగం అంతా హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకు రాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటి వాటా కోసం కేఆర్ఎంబీ, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని పునురుద్ఘాటించారు. సాధికారిక సమాచారంతో కేఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం సూచించారు.
రెండు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. అయితే ఏపి మాత్రం తమకు 70 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. 2021-22 సంవత్సరానికి గానూ 70:30 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని కోరింది. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం నీటి పంపకాలు ఉండాలని లేఖలో పేర్కొంది.