Hyderabad, August 5: నిన్న, మొన్నటి వరకు అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణలోని పలు జిల్లాలు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. దీని తర్వాత వారం రోజులుగా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి భారీ వర్షపాతం నమోదు కాలేదు. కాగా, రాబోయే రెండు రోజుల వరకు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది. పశ్చిమ దిశ నుండి వచ్చే గాలుల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ - హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. అయితే హైదరాబాద్ నగర వాతావరణంలో గణనీయమైన మార్పులేమి ఉండకపోవచ్చునని తెలిపారు.
గడిచిన ఒక్కరోజులో నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి, హైదరాబాద్ మరియు పరిసర జిల్లాలలో వర్షపాతం ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఐఎండీ అంచనా ప్రకారం, ఆగష్టు రెండవ వారం ఉంచి రుతుపవనాలు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడే వాతావరణ పరిస్థితులు అంచనా వేయలేమని తెలిపారు. ఈ వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల నుండి 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
జూలై నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఆగస్టులో కూడా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపిలోని రాయలసీమ ప్రాంతం, కొంకణ్ మరియు గోవా, మధ్య మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలు మరియు బీహార్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.