Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Hyderabad, June 12: తెలంగాణలో శుక్రవారం మరో 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 4,484 కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 4,035 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఎప్పట్లాగే హైదరాబాద్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 133 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తరువాత మేడ్చల్ నుంచి 6, రంగారెడ్డి 6, సంగారెడ్డి 4, నిజామాబాద్ 3, మహబూబ్ నగర్ 2, కరీంనగర్ 2, ములుగు 2 కేసులు రాగా, సిద్దిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్ మరియు వనపర్తి జిల్లాల నుంచి ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.

శుక్రవారం మరో 9 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 174 కు పెరిగింది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

ఇదిలా ఉంటే ఈరోజు అత్యధికంగా 285 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,278 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,032 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

కరోనావైరస్ వ్యాప్తి కట్టడి, లాక్‌డౌన్‌ ఎత్తివేత అంశాలకు సంబంధించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అయితే అందరితో ఒకేసారి కాకుండా దేశంలోని మొత్తం రాష్ట్రాలు మరియు యూటీలను రెండు గ్రూపులుగా విభజించి ఈనెల 16వ తేదీన ఒక గ్రూపుతో, 17వ తేదీన మరో గ్రూపులోని సీఎంలతో పీఎంం చర్చించనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలతో జూన్ 17న మధ్య మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాని సమావేశం జరగనుంది.