
Hyderabad, Sep 4: సోషల్ మీడియాలో అదేపనిగా ఫేక్ న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది. పండుగ సీజన్లో బంపరాఫర్ అంటూ ఇంకా కొన్ని డిస్కౌంట్లతో కూడిన వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. వీటిపై చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వార్త నిజమా కాదా అని తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని షేర్ చేయకూడదు. తాజాగా హైదరాబాద్ పోలీసులు దీనిపై వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఇప్పుడు ఇంకో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలపై భారీగా చలాన్లు (Pending Trf Challans) పెండింగ్‌లో ఉంటాయి. అయితే, ఆ చలాన్లు 50 శాతం రాయితీతో (50% discount Mela) చెల్లించే సదవకాశాన్ని ప్రభుత్వం ప్రకటించిందని, 'దసరా బంపర్ ఆఫర్' పేరిట ఓ ఫేక్ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అక్టోబరు 4 నుంచి 7 వరకు గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా ట్రాఫిక్ చలాన్ల మొత్తాన్ని చెల్లించవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారంటూ అసత్య ప్రచారం జరుగుతోంది.
దీనిపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందిస్తూ అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు. ఇటువంటి డిస్కౌంట్ మేళాలను ప్రకటించలేదని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకూడదని, ఇటువంటివి వ్యాప్తి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Here's HYD Police Tweet
This Fake News is going viral on Social Media by saying that @HYDTP is going to conduct Megha Lok adalat with 50% discount Mela on Pending Trf Challans frm 4thOct to 7thOct in Goshamahal Stadium,but it is confirmed with the Trf wing they r not going to conduct any Discount Mela.. pic.twitter.com/s7zR0kXxmh
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 4, 2021
సాధారణంగా దసరాకు వస్త్ర దుకాణాలు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు వంటివి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే, ఆ సమయంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చలాన్లకూ ఆఫర్ అంటూ వచ్చిన అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని వారు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.