
Hyderabad, March 5: తెలంగాణలో కోవిడ్19 వ్యాప్తి కొనసాగుతోంది, అయితే రోజూవారీ కేసుల్లో గణనీయమైన మార్పులేమి లేవు. ప్రతిరోజూ 100 నుంచి 160 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో తొలి కరోనా కేసు గతేడాది మార్చి మొదటి వారంలోనే నమోదు కాగా, అప్పట్నించీ ఇప్పటివరకు ఒక ఏడాది కాలంలో హైదరాబాద్ నగరంలో సుమారు 54 మందికి వారి శరీరంలో కరోనావైరస్ ప్రతిరక్షకాలు తయారయ్యాయని సీసీఎంబీ, జాతీయ పోషకాహార సంస్థ మరియు భారత్ బయోటెక్ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా హైదరాబాద్ జనాభాకు మరికొన్ని నెలల్లోనే కరోనాను ఎదుర్కొనే హెర్డ్ ఇమ్యునిటీ అభివృద్ధి చెందుతుందని వారి నివేదిక వెల్లడించింది.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే, గత రాత్రి 8 గంటల వరకు 40,443 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 166 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 536 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,99,572కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 27 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 14, మరియు రంగారెడ్డి నుంచి 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,639కు పెరిగింది.
మరోవైపు గురువారం సాయంత్రం వరకు మరో 149 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,95,970 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1963 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
తెలంగాణలో మార్చి 1 నుంచి మూడో విడత కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది, ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాల పంపిణీ చేస్తున్నారు. అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్యాలుంటే వారు కోవిడ్ టీకా పొందేందుకు అర్హులు. గురువారం నాడు అనుకున్న లక్ష్యంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 92 శాతం పైగానే వ్యాక్సిన్ పొందినట్లు ఆరోగ్యశాఖ నివేదిక పేర్కొంది.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 5,05,542 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.