
Hyderabad, May 4: తెలంగాణలో 80 శాతం మంది కోవిడ్ పాజిటివ్ కలిగిన రోగులు ఎలాంటి లక్షణాలు కనబర్చడం లేదని, వారు యధేచ్ఛగా జనాల్లో తిరిగి సెకండ్ వేవ్ కరోనావ్యాప్తిలో ప్రధాన కారణమయ్యారని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి వారే వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు కలిగిన వారికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నారని చెబుతున్నారు. లక్షణాలు కనబరచని వాళ్లలో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపే ఉంటున్నారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరికి కోవిడ్ ఉంది, ఎవరికీ లేదు అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి అందరూ మాస్కులు, భౌతిక దూరం పాటించాలని హెచ్చరిస్తున్నారు. హోం ఐసోలేషన్లో ఉండే వారు ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకకుండా ఇంట్లోకూడా రెండు లేయర్ల మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్ సంబంధిత వైద్య సహాయం, పాజిటివ్ వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఔషధాల సమాచారం తదితర సలహాలు, సూచనల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 040 - 21111111 అనే నెంబర్ కు కాల్ చేసి సమాచారం పొందవచ్చునని తెలిపారు. 104 కాల్స్ ను కూడా దీనికే అనుసంధానం చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు. కంట్రోల్ రూమ్ లో ప్రత్యేక వైద్యులను నియమించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 70,961 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 6,876 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 3,864 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,63,361కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,029 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 502 కేసులు, రంగారెడ్డి నుంచి 387, నల్గొండ నుంచి 402 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 59 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,476కు పెరిగింది.
అలాగే నిన్నటివరకు మరో 7,432 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,81,365 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.