Hyderabad Rains | Twitter Image

Hyderabad, October 14: భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం నీట మునిగింది, రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. మంగళ వారం రోజంతా అత్యధిక వర్షపాతం నమోదైంది.  గత 24 గంటల్లో నగరంలో కొన్ని చోట్ల 20-25 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైందని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ ధృవీకరించారు. అక్టోబర్ మాసంలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం గత వందేళ్లలో ఇది రెండో సారి అని అధికారులు చెబుతున్నారు.  ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు  నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు కారణంగా నాలాలు ఉప్పొంగుతున్నాయి.

చాంద్రయణగుట్టలోని గౌస్ నగర్ కాలనీలో ఓ ఇంటి ప్రహారి గోడ కూలి 8 మంది మృత్యువాతపడ్డారు. అదే కాలనీలో వేరే చోట మరొకరు మృతి చెందడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి. భారీ వర్షాలతో నిన్న రాత్రి నగరంలోని చాలా చోట్ల కరెంట్ నిలిచిపోయి కాళరాత్రిని తలపించింది.

నగర రోడ్ల మీద భారీ ప్రవాహాలు ఉండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులకు నరకం చూపిస్తుంది. బుధవారం కూడా నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

Heavy Rainfall in Hyderabad:

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో ఆరు జిల్లాలకు వరద ముప్పు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్ మరియు మహబూబ్ నగర్ జిల్లాలకు తీవ్రత అధికంగా ఉంటుందని అలర్ట్స్ జారీచేశారు.

సీఎం కేసీఆర్ సమీక్ష

 

కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితిపై రాత్రికిరాత్రే ఆయన హుటాహుటిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అన్ని వేళల, అన్నివిధాలా ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం అయి తక్షణ సహాయచర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎండీ ప్రభాకర్‌రావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో హుటాహుటిన విద్యుత్‌ సౌధకు చేరుకొని గ్రిడ్‌ సమస్య తలెత్తకుండా రక్షణ చర్యలు చేపట్టారు. సీఎం ఆదేశాలతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అప్పటికప్పుడే అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అలాగే సీఎం ఆదేశానుసారం డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయ కార్యక్రమాలపై తక్షణ చర్యలకు ఆదేశించారు.

మరోవైపు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లతో ఫోన్‌లో మాట్లాడారు. పట్టణాలు, నగరాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయచర్యలు చేపట్టాలని, సమాంతరంగా పునర్నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంలో పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారు. మేయర్‌, జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తంచేశారు.