Hyd, June 17: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. అగ్నిపథ్ ఆందోళనలు హైదరాబాద్‌కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు (SCR Cancels 71 Trains) చేసింది. ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. వరంగల్ రైల్వే స్టేషన్‌లోనూ రైళ్లను ఆపివేశారు. రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రైల్వే అధికారులు అల్లర్లు సద్దుమణిగిన తర్వాత సర్వీసులను పునరుద్దరిస్తామని చెబుతున్నారు.
అలాగే పలు రైళ్లను దారిమళ్లించింది. ఇప్పటికే సికింద్రాబాద్-ధన్‌పూర్, హైదరాబాద్-షాలిపూర్ ఈస్ట్‌కోస్ట్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచీగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. స్టేషన్లలోకి పోలీసులు ఎవరీని అనుమతించడంలేదు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్నిపథ్ నిరసన సెగ రైల్వే ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారడంతో పలు రైళ్ళు రద్దయ్యాయి. మరి కొన్ని రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. అగ్నిపథ్ ఆందోళనతో రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్లాట్ ఫామ్ పైకి ఎవ్వరిని రానివ్వకపోవడంతో స్టేషన్ బోసిపోగా, స్టేషన్ ముందు ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ( Secunderabad Railway Station) ఆర్మీ అభ్యర్థులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో( Agnipath protests in Hyderabad) పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. మూడు రైళ్లను తగులబెట్టారు. పార్సిళ్లను రైలు పట్టాలపై వేసి కాల్చివేశారు. పలు రైళ్ల అద్దాలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు, డిస్‌ప్లే బోర్డులను పగులగొట్టారు. ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న దుకాణాలను ధ్వంసం చేయడంతోపాటు లూటీ చేశారు. దీంతో ఆదోంళనకారులను అదుపుచేయడానికి రైల్వే పోలీసులు 15 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇందులో గాయపడిన ఓ యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతిచెందిన వ్యక్తిని నిర్మల్ జిల్లాకు చెందిన దామోదర్ కురేషియాగా గుర్తించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డుకు వెళ్లి అక్కడినుంచి స్టేషన్‌కు వచ్చినట్లు గుర్తించారు.
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేషన్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీగా బలగాలను మోహరించారు. స్టేషన్‌లోకి ఎవరినీ అనుమంతించడం లేదు. అదేవిధంగా వరంగల్, నిజామాబాద్, డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో బందోబస్తు పెంచారు. వరంగల్, ఖాజీపేట రైల్వే స్టేషన్లలో భాద్రతా ఏర్పాట్లను సీపీ తరుణ్ జోషి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.సికింద్రాబాద్ స్టేషన్‌లో నిర్వహించిన ఆందోళనలతో దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం జరిగిందని సౌత్‌సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రైల్వే అధికారులు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేశారు. మొత్తం 44 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు సికింద్రాబాద్-ధన్‌పూర్, ఈస్ట్‌కోస్ట్ రైళ్లను క్యాన్సల్ చేశారు.
ఏ రూట్‌లో ఎన్నంటే..
లింగంపల్లి-హైదరాబాద్- 8 సర్వీసులు
హైదరాబాద్-లింగంపల్లి- 9 సర్వీసులు
ఫలక్‌నుమా-లింగంపల్లి- 12 సర్వీసులు
లింగంపల్లి-ఫలక్‌నుమా- 13 సర్వీసులు
ఫలక్‌నుమా-హైదరాబాద్- 1
రామచంద్రాపురం-ఫలక్‌నుమా- 1 సర్వీసు చొప్పున ఉన్నాయి.