Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, సభ ముందుకు నాలుగు కీలక బిల్లులు, కోవిడ్ నెగిటివ్ ఉంటేనే సభలోకి ఎంట్రీ
Telangana Assembly | Photo: Wikimedia Commons

Hyderabad, Oct 13: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో నాలుగు బిల్లులను (Four Bills) ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బిల్లుల ఆమోదం తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడనుంది. రేపు శాసనమండలి సమావేశం జరగనుంది. ఇవాళ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులపై రేపు కౌన్సిల్ లో చర్చ జరగనుంది.

జిహెచ్ఎంసిలో (GHMC) 50 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు, 2016లో అమలులో ఉన్న రిజర్వేషన్లు కొనసాగింపు, స్టాంప్ డ్యూటీ చెల్లించే సమయంలో భూముల విలువల నిర్ధారణలో రిజిస్ట్రార్ కి ఉన్న విచక్షణాధికారాలు తొలగింపు చట్ట సవరణ, వ్యవసాయ భూములను వ్యవసాయేతరాలను మార్పుచేసే అధికారం ఆర్డీవో నుంచి తాహశీల్దార్ కు బదలాయింపు, హైకోర్టు సూచన మేరకు నిందితుల పూచీకత్తు అంశంపై సీఆర్పీ చట్ట సవసరణ వంటి బిల్లులను సర్కార్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

అయితే కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సంస్కరణలకు పెద్దపీట, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ చట్టం సవరణకు ఈ సమావేశంలో నోచుకోనుంది. పలు అంశాలతో పాటు జీహెచ్‌ఎంసీ చట్టంతో పాటు మరో మూడు చట్టాలు సవరణ కానున్నాయి. సభ ప్రారంభం కాగానే.. చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

తెలంగాణలో కొత్తగా మరో 1708 పాజిటివ్ కేసులు మరియు 5 కొవిడ్ మరణాలు నమోదు, హెల్త్ బులెటిన్ గణాంకాలపై అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు

మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ మూడు చట్టాలకు సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు. వీటిపై చర్చించి ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్‌ వాయిదా వేస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే మండలి... శాసనసభ ఆమోదించిన బిల్లులను చర్చించి ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది.

బిల్లులకు ఇప్పటికే మంత్రి మండలి ఆమోద ముద్రవేసింది. మొత్తం నాలుగు బిల్లులను సభ ముందుకు రానున్నాయి. భూముల ధర నిర్ధారణకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్లకు 47ఏ కింద ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ ఇండియన్‌ స్టాంప్‌ చట్టానికి సవరణను రాష్ట్ర ప్రభుత్వం సవరణ సీఎం కేసీఆర్‌ సభలో ప్రవేశపెట్టనున్నారు.

వ్యవస్యాయ భూముల్ని వ్యవసాయేతరులుగా బదలాయించే ప్రక్రియలో అధికారులకు విచక్షణాధికారాలు లేకుండా ‘ధరణి’ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకునేలా చట్ట సవరణను సీఎం ప్రవేశపెట్టనున్నారు. పలు కీలక సవరణకు ఉద్దేశించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్ట సవరణ బిల్లును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సభలో ప్రవేశపెట్టనున్నారు.

ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం, పారదర్శకత, పని చేయని వారిపై వేటు, వార్డు కమిటీలు, పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యం, రెండు ఎన్నికల్లో ఒకే రిజర్వేషన్లులాంటి అంశాలు బిల్లులో ఉండనున్నాయి. నిందితులకు పూచీకత్తుకు సంబంధించి హైకోర్టు సూచన మేరకు కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ చట్ట సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నాలుగు బిల్లులపై అసెంబ్లీలో ఇవాళ చర్చ జరుగనుంది. శాసన సభ ఆమోదం తర్వాత బిల్లులను బుధవారం మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఉభయ సభల ప్రాంగణాల్లో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు కరోనా లక్షణాలు న్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవాలని మండలి చైర్మన్‌ గుత్తా, శాసన సభ స్పీకర్‌ పోచారం సూచించారు.