File Images of Pranay+Amrutha & Maruthi Rao | File Photo

Miryalaguda, March9:  మిర్యాలగూడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, దళితుడైన తన అల్లుడు ప్రణయ్ హత్య కేసులో (Pranay Murder Case)  ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు (Maruthi Rao) అంత్యక్రియలు సోమవారం స్థానిక హిందూ స్మశాన వాటికలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన తండ్రిని కడసారి చూసేందుకు కూతురు అమృత (Amrutha)  నిశ్చయించుకుంది, అయితే అమృత రాకను మాత్రం కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ అమృత మాత్రం తన తండ్రిని మృతదేహాన్ని కడసారి చూసేందుకు వీలు కల్పించాల్సిందిగా పోలీసులను కోరింది. తనపై దాడి జరిగే అనుమానులు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను విజ్ఞప్తి చేసింది.

దీంతో పోలీస్ బందోబస్తు నడుమ అమృత తన తండ్రి మారుతీరావు అంత్యక్రియల్లో  పాల్గొనేందుకు వచ్చింది. అయితే అమృత రాగానే పెద్ద సంఖ్యలో మారుతీరావు బంధువులు ఆమె రాకను వ్యతిరేకించారు. అమృత గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  స్మశానవాటిక వద్ద పరిస్థితులు ఉద్రిక్త్రంగా మారడంతో,  అమృత కారు నుంచి దిగకుండానే పోలీసులు ఆమెను అక్కడ్నించి తరలించారు.  ఈ నేపథ్యంలో తండ్రిని కడసారి చూడాలన్న ఆమె కోరిక నెరవేరలేదు.

కూతురి కోసం ఎవర్నైనా చంపేసేంత ప్రేమ మారుతీ రావుది, ఈ విషాద గాథలో చివరికి మిగిలిందేమిటి?

మారుతీరావు అంత్యక్రియల నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. దీంతో పోలీసులు మఫ్టీలో పహారా కాస్తున్నారు. ఇటు మారుతీరావు నివాసం వద్ద మరియు అటు అమృత మామ బాలస్వామి ఇంటి వద్ద పోలీసులు మఫ్టీలో మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

గారాబంగా పెంచుకున్న కూతురు ఒక దళిత యువకుడు ప్రణయ్ ను పెళ్లి చేసుకొని, కుటుంబ సభ్యులను లెక్కచేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అవమానంగా భావించిన మారుతీరావు ఆ యువకుడి మీద కక్షగట్టాడు. రెండేళ్ల క్రితం 2018, సెప్టెంబర్ 14న కిరాయి గుండాలకు రూ. 1 కోటి సుపారీ ఇచ్చి ప్రణయ్ ను హత్య చేయించాడు.

దీంతో మారుతీరావును అరెస్ట్ చేసిన పోలీసులు అతణ్ని ఈ కేసులో ఏ1 నిందితుడిగా చేర్చి, జైలుకు తరలించారు. దాదాపు 7నెలలపాటు జైలు జీవితం గడిపిన అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. అయినప్పటికీ ఈ కేసులో ఒత్తిడి, కేసులోని మిగతా నిందితులు డబ్బు కోసం మారుతీరావును బ్లాక్ మెయిల్ చేయడం, ఇటు కూతురు అమృత కూడా ఇంటికి తిరిగిరాక పోగా, తన మొఖం చూసేందుకే అసహ్యించుకుంటుండతో తీవ్రంగా కుంగిపోయిన మారుతీ రావు, మొన్న శనివారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్ట్ కూడా మారుతీ రావుది ఆత్మహత్యగానే పేర్కొంది.