Chickens (Photo Credits: ANI)

Hyderabad, Mar 3: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాల్వ శ్రీరాంపూర్‌లో నాలుగు వేల నాటు కోళ్లు (4000 hens died) అకస్మాత్తుగా మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది. బర్డ్ ఫ్లూ సోకిన (Bird Flu Fear in Telangana) కారణంగానే కోళ్లు చనిపోయినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం పూట దాణా తిన్న తర్వాత రెండు గంటల్లోనే నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి.

ఎండల వేడా, లేక మరేదైనా కారణంతో చనిపోయాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోళ్ల మీద విష ప్రయోగం జరిగిందేమో అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. బర్డ్‌ ఫ్లూ సోకినా ఒక్క రోజులోనే అన్ని వేల కోళ్లు చనిపోవడం జరగదని, ఇది కచ్చితంగా ఎవరో కావాలని చేసిందేనని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లాలో గత నెలలో వింత వ్యాధి కలకలం రేపిన సంగతి విదితమే. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే వందలాది కోళ్లు, కాకులు చనిపోవడంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు. గడిచిన వారం రోజుల్లో దారూర్‌ మండలం దోర్నాల, యాలాల మండలంలోని పలు గ్రామాల్లో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. వాటిని పూడ్చిపెట్టకుండా గ్రామస్తులు బయటపడేయడంతో.. కుక్కలు, కాకులు తిని ప్రాణాలు వదిలాయి.

పక్షుల నుంచి మనుషులకు బర్డ్‌ఫ్లూ వైరస్‌, పక్షుల లాలాజలం, వ్యర్ధాల ద్వారా మనషులకు వ్యాప్తి చెందే అవకాశం, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న సైంటిస్టులు

ఇక వింత వైరస్‌తో ఏకంగా 30 వేల కోళ్లు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన గూడెంలో గత నెలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తహశీల్దార్ రవికూర్ అప్పుడు స్పందించారు. ఈ మధ్య కోళ్లకి వింత వైరస్ సోకిందని, డాక్టర్లు టెస్ట్ చేసినా ఆ వైరస్ ఏంటనేది కనిపెట్టలేకపోతున్నారన్నారు. 30 వేల కోళ్లు చనిపోయన్నారు. అయితే ఇలా చనిపోయిన కోళ్లని అగ్రహారం గ్రామం దగ్గర్లని చెరువులో గోతులు తీసి వేస్తున్నారు. వాటిపై మట్టిని పూడ్చకపోవటంతో.. కుక్కలు పీక్కుతింటున్నాయి. ఫలితంగా ఈ వైరస్ బాగా వ్యాపించిందనే వార్తలు కూడా వచ్చాయి.