BJP Appoints New State Chiefs: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగతంగా బీజేపీ(BJP) కీలక మార్పులు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు పార్టీ నూతన అధ్యక్షులను నియమించింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సంజయ్‌ను తొలగించింది. కొత్తగా ఆ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(G Kishan Reddy)కి అప్పగించారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసింది.
జి.కిషన్ రెడ్డి బీజేపీలో సీనియర్ నాయకుడు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2010-14 మధ్య ఉమ్మడి ఏపీకి, 2014-16 మధ్య తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. 2016-18 మధ్య శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు.
కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే
2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే
2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక
2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణలో పోరుయాత్ర
2019లో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నిక
ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు
ఇటీవల బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఈటెల వర్గం ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. గడిచిన కొన్ని రోజుల నుంచి బండికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. బండి అడ్డగోలుగా సంపాదిస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పై బీజేపీ వేటు వేసినట్లు తెలుస్తోంది.