Venue for first public meeting of BRS. (Photo Credits: BRS)

Khammam, Jan 18: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జాతీయ పార్టీగా అవతరించిన భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభకు ఖమ్మం సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం అనంతరం నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ (BRS Khammam Meeting) ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే కేంద్రీకృతమైంది. అయిదు లక్షల మంది వస్తారన్న అంచనాతో సిద్ధం చేసిన మైదానంలో సభ ఏర్పాట్లు మంగళవారం రాత్రికే పూర్తయ్యాయి. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన తరువాత కరీంనగర్‌లో నిర్వహించిన తొలి బహిరంగ సభకు జేఎంఎం నేత, జార్ఖండ్‌ మాజీ సీఎం శిబుసోరెన్‌ను ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. నేడు ఖమ్మం సభకు ముగ్గురు ముఖ్యమంత్రులను, ఒక మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సహా పలువురు జాతీయ నేతలను సీఎం కేసీఆర్‌ ఖమ్మం బహిరంగసభకు ఆహ్వానించారు.

పార్టీ జాతీయ ఎజెండాతో పాటు బీజేపీకు ప్రత్యామ్నయంగా తమ పార్టీ ఎజెండాను కేసీఆర్‌ ఈ వేదికపై వెల్లడించనున్నారు. ఆరు రాష్ట్రాల పార్టీ శాఖలు, రైతు విభాగాలను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌ (Delhi CM Arvind Kejriwal), భగవంత్‌సింగ్‌ మాన్‌, పినరయి విజయన్‌తో (Kerala CM Pinarayi Vijayan) పాటు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు విచ్చేస్తుండటంతో రాజకీయ కోలాహలం కనిపిస్తోంది. ఆహ్వానిత నేతల్లో పలువురు మంగళవారం రాత్రికే హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారత్, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌కు 2500 మందితో భద్రత, వివరాలను వెల్లడించిన రాచకొండ సీపీ డీసీ చౌహన్

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పాదయాత్రలో ఉండడంతో ఆయన రావడం లేదు. జాతీయ కిసాన్‌ మోర్చాతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భారాసలో చేరనున్న నేతలు, ప్రముఖులు సభలో పాల్గొననున్నారు. తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ ఇప్పటికే BRSలో విలీనానికి ముందుకొచ్చింది. ఖమ్మం సభలో దీన్ని ప్రకటించే వీలున్నట్లు తెలిసింది.

ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ (భారత్‌ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జాతీయ నేతలకు సీఎం కేసీఆర్‌ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ నేత డి. రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

పండగ తర్వాత హైదరాబాద్ వస్తున్నారా, అయితే ఈ 17 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తుపెట్టుకోవడం మరచిపోకండి, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల లిస్టును విడుదల చేసిన తెలంగాణ పోలీసులు

అల్పాహార విందు సమావేశం అనంతరం వీరంతా సీఎం కేసీఆర్‌తో కలిసి యాదాద్రి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రిలో ముఖ్యమంత్రుల పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని పూలు, తోరణాలతో సుందరంగా అలంకరించారు. సీఎంల కోసం ఆలయంలో ప్రత్యేక ప్రసాదాలు, జ్ఞాపికలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు యాదాద్రిలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 1600 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఖమ్మం సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండటంతో పాటు భారీగా జనాలు హాజరుకానుండటంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు డీజీ విజయ్‌కుమార్‌, ఐజీపీ షాన్‌వాజ్‌ ఖాసిం, చంద్రశేఖర్‌రెడ్డి, డీఐజీలు రమేశ్‌నాయుడు, ఎల్‌ఎస్‌ చౌహాన్‌, వరంగల్‌, ఖమ్మం సీపీలు రంగనాథ్‌, విష్ణు వారియర్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహణకు 5200 పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తుకు నియమించారు.