Hyd, Sep 23: హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రిని పరిశీలించేందుకు లోపలికి వెళ్లాలని ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. కాగా, బీఆర్ఎస్ వేసిన కమిటీలో వైద్యులైన సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్ సభ్యులుగా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల అరెస్టుతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
గాంధీ సహా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు రాజయ్య నేతృత్వంలో బీఆర్‌ఎస్ నిజ నిర్ధారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. నేటి నుంచి నిపుణులైన డాక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. ఇందులో భాగంగా గాంధీ ఆస్పత్రిను పరిశీలించాల్సి ఉన్నది.
అయితే కమిటీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. రాజయ్య సహా కమిటీ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే సంజయ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గాంధీ ఆస్పత్రికి చేరుకున్న కమిటీ సభ్యులతోపాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు జనగామ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు.