Siddipet December 02: సిద్దిపేట(Siddipet)లో విషాదం నెలకొంది. రోడ్డుపై వెళ్తున్నకారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. అయితే కారును బయటకు తీసేందుకు బావి(Well)లోకి దిగిన గజ ఈతగాడు(Swimmer) కూడా నీటిలో ఊపిరాడక చనిపోయాడు. వృత్తి ధర్మంతో ఇతరులకు సాయం చేసేందుకు బావిలోకి దిగిన వ్యక్తి కూడా మరణించడం అందరినీ కలిచివేసింది.
బావిలో పడిన కారును బయటకు తీసేందుకు అందులోకి దిగిన గజ ఈతగాడు.. కారుకు తాడు కట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. ఆరు గంటలు శ్రమించి చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. తీరా మిగిలిన గజ ఈతగాళ్లు.. క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా.. అందులో తల్లీకొడుకు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట(Siddipet) జిల్లా దుబ్బాక(Dubbak) మండలం చిట్టాపూర్ పరిధిలో చోటు చేసుకుంది.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లి భాగ్యలక్ష్మి(50), కుమారుడు ప్రశాంత్(25) కలిసి నందిగామ నుంచి హుస్నాబాద్‌కు బుధవారం ఉదయం కారులో బయల్దేరారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పడంతో.. చిట్టాపూర్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. కారు బావిలో పడటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది(Fire tenders) కలిసి గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కారును బయటకు వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ఓ గజ ఈతగాడు కారును గుర్తించి.. దానికి క్రేన్ తాడును బిగించేందుకు వెళ్లాడు. తాడు బిగించిన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో ఊపిరాడక కారులోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. క్రేన్ సాయంతో కారుతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు బయటకు తీసుకొచ్చారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.