Bollineni Srinivasa Gandhi Bribe Case: గాంధీపై బిగిస్తున్న సీబీఐ ఉచ్చు, లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన బొల్లినేని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దిమ్మతిరిగే నిజాలు
File image used for representational purpose | (Photo Credits: ANI)

Hyderabad, Sep 12: గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్న ఈడీ మాజీ అధికారి శ్రీనివాసగాంధీపై (Bollineni Srinivasa Gandhi Bribe Case) మరో కేసు నమోదయ్యింది. ఇన్‌పుట్‌ క్రెడిట్‌ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని శ్రీనివాసగాంధీ సీబీఐకి (CBI) దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేసింది. ఈ కేసులో భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.

హైదరాబాద్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో బొల్లినేని సూపరింటెండెంట్‌గా గతేడాది పనిచేశారు. ఇన్‌పుట్‌ క్రెడిట్‌ మంజూరు కేసును తారుమారు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. కాగా, మరో మహిళా అధికారి సుధారాణిపై కూడా కేసు నమోదయ్యింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తవ్వుతున్న క్రమంలోనే బొల్లినేనిపై తాజా కేసు నమోదైందని సమాచారం.

భరణీ కమోడిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ సత్యశ్రీధర్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదయ్యింది. ఇన్‌పుట్‌ క్రెడిట్‌ మంజూరు చేసేందుకు శ్రీనివాసగాంధీ రూ.5 కోట్లు లంచం డిమాండ్‌ చేశారు. బొల్లినేని ఈ మొత్తంలో రూ. 10 లక్షలు నగదు రూపంలో మిగతా సొమ్ము ఓపెన్‌ ప్లాట్‌, ఫ్లాట్‌ రూపంలో ఇవ్వాలని బొల్లినేని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ముగ్గురిపైనా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం విషయాలన్నింటినీ సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొంది. బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఈడీలో, జీఎస్టీ సీనియర్ అధికారిగా (Former ED Officer Bollineni Srinivasa Gandhi) పని చేశారు.

కలెక్టర్‌, వైద్యుడు మధ్య వాగ్వాదం, వైద్యుడిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్, నరసరావుపేటలో కోవిడ్ సమీక్షా సమావేశంలో ఘటన

ఇదిలావుంటే, గతేడాది జులైలో బొల్లినేని ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. గత ఏడాది జూలై 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.200 కోట్ల విలువచేసే అక్రమాస్తుల్ని గుర్తించింది. అనంతరం ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా, మరోమారు లంచంకేసులో బొల్లినేనిని ఈడీ దర్యాప్తు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు ఆధారంగా ముందుకు వెళ్లిన ఈడీ శ్రీనివాసగాంధీపై అదే నెల 23న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) దాఖలు చేసింది.

అసలేం జరిగింది:

హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ పన్ను ఎగవేత విభాగంలోని అధికారులు లంచం తీసుకున్నట్లుగా గతేడాది అక్టోబర్‌ 31న సీబీఐకి సమాచారంఅందింది. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే దీనిపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఇన్ఫినిటీ మెటల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌– దాని అనుబంధ సంస్థలు అక్రమంగా ఇన్‌ పుట్‌ క్రెడిట్‌ ట్యాక్స్‌ (ఐటీసీ) పొందాయన్న కేసును చిలుక సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీ బృందం దర్యాప్తు చేసింది.

కేసును నిందితులకు అనుకూలంగా మార్చేందుకు వీరు, మరికొందరు జీఎస్టీ అధికారులతో కలిసి రూ.5 కోట్లు లంచం డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా 2019, ఏప్రిల్‌ 15న రూ.10 లక్షల నగదు తీసుకున్నారు. మిగిలిన మొత్తానికి భూములను కొనివ్వాలన్న ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ విషయంపై సీబీఐకిగానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ఫిర్యాదు చేయనందుకుగాను సత్య శ్రీధర్‌రెడ్డి పేరును కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. సీబీఐ నమోదు చేసిన కేసు, చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం పెరిగాయి. 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు.. 2019, జూన్‌ 26 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటేనని వార్తలు వినిపిస్తున్నాయి.

గడిచిన పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న శ్రీనివాస గాంధీ ఆయన కుమార్తె మెడికల్‌ సీటుకే రూ.70 లక్షలు కట్టారు. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, పొద్దుటూరు, హైదరాబాద్‌లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిలలో, స్థిరాస్తులు కూడగట్టిన గాంధీ భారీగా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గత ఏడాది నమోదు చేసిన తన ఈసీఐఆర్‌లో ఆరోపించింది.

త్వరలో ఈ కేసుకు సంబంధించి గాంధీ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా, శ్రీనివాసగాంధీపై సీబీఐ రెండు రోజుల క్రితం మరో కేసు నమోదు చేసింది. ఇన్‌ పుట్‌ క్రెడిట్‌ మంజూరుకు సంబంధించి రూ.5 కోట్లు డిమాండ్‌ చేసిన కేసులో బొల్లినేనితో పాటు మరో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.