Hyderabad, May 01: చేనేత కార్మికుల సంక్షేమంపై గత శనివారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) చెప్పిన మాటలు అతడి అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వానికి నిదర్శనంగా ఉన్నాయని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రభుత్వం చేపట్టని స్థాయిలో విప్లవాత్మకమైన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని తెలంగాణ సర్కారు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. నేతన్నలతోపాటు రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అద్భుతమైన కార్యక్రమాలను చేపడుతున్నారని, యావత్ దేశానికి మార్గదర్శిగా తెలంగాణను నిలుపుతున్నారని పేర్కొన్నారు. నేతన్నలపై (Wavers) సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఆదివారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాలుగా అరకొర బడ్జెట్ ఇచ్చి నేతన్నల సంక్షేమంపై మొసలి కన్నీరు కార్చిన గత ప్రభుత్వాలకు భిన్నంగా, తమ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను ఒకేసారి బడ్జెట్లో కేటాయించిందని, నేతన్నల సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. నేతన్న రుణాలను మాఫీ చేసి వారిని అప్పుల ఊబినుంచి కాపాడినట్లు తెలిపారు.
చేనేత కార్మికుల సంక్షేమంపై నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అతడి అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వానికి నిదర్శనంగా ఉన్నాయి : మంత్రి శ్రీ @KTRTRS.
నేతన్నల సంక్షేమంపైన బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ : https://t.co/LPvO81XmZK pic.twitter.com/xPsXSFYIQg
— TRS Party (@trspartyonline) May 1, 2022
దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్న ‘చేనేత మిత్ర’ (Chenetha Mitra) పథకం తెలంగాణలోనే ఉందని, ‘నేతన్నకు చేయూత’ (Nethannaku Cheyutha) పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం కోవిడ్ సంక్షోభ కాలంలో వారికి ఒక ఆపన్నహస్తంగా మారిందని వెల్లడించారు. మగ్గాల అధునికీకరణ నుంచి ‘వర్క్ టూ ఓనర్ పథకం’ (Work to Owner) వరకు తమ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల నేడు రాష్ట్రంలోని నేతన్నల ఆదాయం రెట్టింపై వారు గౌరవంగా తమకాళ్లపై తాము నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కేవలం నేతన్నలనే కాకుండా స్థూలంగా టెక్స్ టైల్ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ టెక్స్ టైల్ పార్ (kakathiya Textile Park)కు ఏర్పాటుతోపాటు అనేక మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామన్నారు.
చేనేతలతోపాటు పవర్‌లూమ్ కార్మికులకు సైతం పెద్ద ఎత్తున సహాయం అందించినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఉరికొయ్యలకు వేలాడిన నేతన్నలు.. నేడు సుఖశాంతులతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్ మళ్లీ నేతన్నలకు పాతరోజులు రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. నేతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను పట్టించుకోకుండా, నేతన్నలను మోసపుచ్చే విధంగా ఆయన కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.
నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు అండగా నిలువాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఇందుకు భిన్నంగా సంపూర్ణ సహాయ నిరాకరణ చేస్తున్నదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే అనేక సార్లు కేంద్రంలోని మంత్రులు, ప్రధాన మంత్రిని సైతం కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని, అంతేకాకుండా రాష్ట్రంలో ‘నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ ఏర్పాటు, చేనేత కోసం ఒక ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ’, ‘మెగా పవర్‌లూమ్ క్లస్టర్’ ఏర్పాటు, తదితర రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనమని కేటీఆర్ తెలిపారు.
వాస్తవాలు ఇలావుంటే.. బండి సంజయ్ పాదయాత్ర పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలపై దండయాత్ర చేస్తున్నాడని ధ్వజమెత్తారు. తన కపట పాదయాత్రలో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని మాట్లాడుతున్న బండి సంజయ్, కేంద్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి అవకాశవాదంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.