File Image of CM KCR Visiting Kaleshwaram | Photo: CMO

Karimnagar, February 13:  తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) గురువారం కాళేశ్వరంలో (Kaleshwaram) పర్యటిస్తున్నారు.  నిన్న రాత్రే కరీంనగర్ చేరుకున్న సీఎం అక్కడే తీగలగుట్టలో ఉన్న ఉత్తర తెలంగాణ భవనంలో బస చేశారు. గురువారం మధ్యాహ్నం కరీంనగర్ నుంచి కాళేశ్వరంకు బయలుదేరిన కేసీఆర్, హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ జలాశయం, కన్నెపల్లి పంప్ హౌజ్ లను విహంగ వీక్షణం చేశారు. అనంతరం గోదావరి నది పుష్కర్ ఘాట్ కు చేరుకొని త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పవిత్ర జలాలను నెత్తిన చల్లుకొని, నదిలో నాణేలు జారవిడిచారు. గోదావరి తల్లికి చీర, సారే సమర్పించారు.

అక్కడ్నించి ముక్తేశ్వర స్వామి ఆలయం చేరుకున్న సీఎం కేసీఆర్, స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాల మధ్య తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. సీఎం వెంట సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేంధర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక దీని తర్వాత అక్కడే ఉన్న లక్ష్మీ బ్యారెజీను పరిశీలించి తిరిగి విశ్రాంతి భవనానికి చేరుకోనున్నారు. లండన్ నగరంలో థేమ్స్ రివర్‌లా తెలంగాణలో మానేరు నది -సీఎం కేసీఆర్

అంతకుముందు రోజు బుధవారం, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసీ వీరవనిత, వనదేవత ‘‘సమ్మక్క’’ పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం బ్యారేజీకి ‘‘సమ్మక్క బ్యారేజీ’’ గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఇఎన్ సీ శ్రీ మురళీధర్ రావును ఆదేశించారు.

ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉండటం చేతనే తెలంగాణలో అభివృద్ది అనుకున్న రీతిలో సాగుతున్నదని సీఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యి తెలంగాణ బీళ్లల్లోకి కాళేశ్వరం సాగునీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు.

సీఎం మాట్లాడుతూ "కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నది. ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారినయి. రానున్న వానాకాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా అటునుంచి కాలువలకు మల్లించే దిశగా ఇరిగేషన్ శాఖ ఇప్పటినుంచే అప్రమత్తం కావాలె. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలె’’ అని అధికారులకు సూచించారు.