Representational Image| file Photo

Hyderabad, February 5: ఎట్టకేలకు టీఎస్ఆర్టిసి (తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉద్యోగ భద్రత లభించింది. ఉన్నతాధికారుల నుండి ఆర్టీసీ కార్మికులు అనవసరమైన వేధింపులకు గురికాకుండా మరియు ఎటువంటి బలమైన కారణాలు లేకుండా సర్వీసు నుంచి తొలగించకుండా, రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది.

ఇంతకుముందు వాగ్దానం చేసినట్లుగా, ఆర్టీసీ ఉద్యోగులందరి ఉద్యోగ రక్షణకు సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ముఖ్యమంత్రి.. ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, సేవ విషయంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం, సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

నూతన మార్గదర్శకాల ప్రకారం, ఉన్నత అధికారులు, ప్రధానంగా డిపో నిర్వాహకులు మరియు ప్రత్యేక అధికారాలు కలిగినన రీజినల్ మేనజర్లు కార్మికులను విచక్షణారహితంగా విధులను తొలగించడానికి వీలుపడదు. అలాగే, కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మరియు వారి సేవలను గుర్తించడానికి ఆర్టీసీ డైరెక్టర్ నేతృత్వంలోని ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబడుతుంది.

ఇక తాము కోరుకున్నట్లుగా, ఉద్యోగ భద్రత లభించడంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.