Telangana Oil Palm Project: తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం, ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు 50 శాతం సబ్సిడీ అందిస్తామని వెల్లడి
Telangana CM KCR | File Photo

Hyderabad, December 8: తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఆమోదించారు. రైతులకు 50 శాతం సబ్సిడీ ఇచ్చి ఆయిల్ పామ్ సాగు చేయించనున్నట్లు సీఎం వెల్లడించారు. నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్ పామ్ సాగు చేయడం సాధ్యమవుతుందని, తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయం రాష్ట్ర రైతాంగం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని 25 జిల్లాలను ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా నేషనల్ రీ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిందని సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచే విధానంపై ప్రగతి భవన్ లోఉన్నతస్థాయి సమీక్ష జరిపిన సీఎం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆయిల్ పామ్ సాగు – ముఖ్యాంశాలు:

➧ ఒక ఎకరం వరిని సాగు చేయగలిగే నీటితో 4 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు.

➧ దేశంలో, ప్రపంచంలో ప్రస్తుతం వరి ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉన్నాయి. కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేయడం మేలు.

➧ భారతదేశానికి 22 మిలియన్ టన్నుల ఆయిల్ కావాలి. కానీ దేశంలో 7 మిలియన్ టన్నుల ఆయిల్ తీయడానికి అవసరమయ్యే నూనె గింజలు మాత్రమే పండిస్తున్నాం. ప్రతీ ఏడాది 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ప్రతీ ఏడాది 70 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తున్నది. దిగుమతి చేసుకోవడం వల్ల ఆయిల్ కల్తీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

➧ ప్రస్తుతం దేశంలో 8 లక్షల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు అవుతున్నది. ఇంకా లక్షలాది ఎకరాల్లో విస్తరించాల్సిన అవసరం, అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోనే 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలి.

➧ వరితో పోలిస్తే తక్కువ నీరే అవసరం అయినప్పటికీ, ఆయిల్ పామ్ కు ప్రతీ రోజు నీటి తడి అందించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం పెరగడంతో పాటు, నిరంతర విద్యుత్ సరఫరా ఉంది. ఇవి సానుకూలంగా ఉండడం వల్లే కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగు చేయడానికి అనువైనదిగా గుర్తించాయి.

➧ ప్రస్తుతం రాష్ట్రంలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కేవలం 38 వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు అవుతున్నది.

➧ రాష్ట్రంలోని నిర్మల్, మహబూబాబాద్, కామారెడ్డి, వరంగల్ రూరల్, నిజామాబాద్, సిద్దిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, సూర్యాపేట, ములుగు, నల్లగొండ, జనగామ, వరంగల్ అర్బన్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్ నగర్, కొత్తగూడెం జిల్లాల్లో 8,14,270 ఎకరాల్లో ఆయల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించారు.

➧ మూడేళ్ల పాటు అంతర పంట వేసుకోవచ్చు. నాలుగో ఏడాది నుంచి ఆయిల్ పామ్ పంట వస్తుంది. ఒక్కసారి నాటిన మొక్క వల్ల 30 ఏళ్ల పాటు పంట వస్తుంది. ఆయిల్ పామ్ పంటలో అంతర పంటగా కొకొవా కూడా పండించవచ్చు. ఆయిల్ పామ్ తోట చుట్టూ టిష్యూ కల్చర్ టేకు, శ్రీగంధం సాగు చేయవచ్చు.

➧ అన్ని నూనె గింజల్లోకెల్లా ఆయిల్ పామ్ దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఎకరానికి 10-12 టన్నుల గెలలు వస్తాయి.

➧ ఎకరానికి రైతుకు ఏడాదికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం వస్తుంది.

➧ మొదటి నాలుగేళ్లు ఒక్కో ఎకరానికి రూ.60 వేల వరకు ఖర్చు వస్తుంది. ఇందులో 50 శాతం ప్రభుత్వ సబ్సిడీగా ఉంటుంది.

➧ ఈ పంటకు కోతులు, అడవి పందుల, రాళ్లవాన, గాలివాన బెడద ఉండదు.

➧ ఒక కుటుంబం 30-40 ఎకరాల పంటను పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.

➧ ఈ చెట్లు ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని, ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తాయి.

➧ ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు విధిగా మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేసే విధానం చట్టంలోనే పొందు పరిచారు.

➧ ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల దర టన్నుకు రూ.12,800 ఉంది. ఇది ప్రతీ ఏటా పెరుగుతుందే తప్ప తగ్గదు.

➧ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ తో పాటు 14 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ స్వంత ఖర్చులతో నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టబోతున్నాయి. ప్రతీ కంపెనీకి సాగు చేసే ప్రాంతాలను జోన్లుగా విభజించి, వారికి అప్పగించడం జరుగుతుంది.