RTC JAC held meeting at Telangana BJP office over their ongoing strike. | Photo : twitter

Hyderabad, November 6:  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఈనెల 9న హైదరాబాద్, ట్యాంక్ బండ్ వద్ద తలపెట్టిన మిలియన్ మార్చ్ కు బీజేపీ సంపూర్ణ మద్ధతు ప్రకటించిందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) తెలిపారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ (K. Laxman) ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) విషయమై దిల్లీలోని కేంద్రం పెద్దలను కలిసి వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆర్టీసీ ఐకాస నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ తదితరులు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తాం అని సీఎం కేసీఆర్  (CM KCR) చేస్తున్న వ్యాఖ్యలకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కేంద్రం ఆమోదం లేకుండా ఆర్టీసీ స్వరూపాన్ని మార్చే అధికారం కేసీఆర్ కు లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ఆర్టీసీ విభజన జరగలేదని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా, మంత్రులు బ్రతిమిలాడినా 300 మందికి మించి కార్మికులెవ్వరూ ఉద్యోగాల్లో చేరలేదు, ఆ చేరిన వారికి డ్యూటీలు వేసే పరిస్థితులు లేవని చెప్పారు. 33 రోజులుగా సమ్మె జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.

"మేం సెలక్షన్ ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్లం, కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే చెల్లదు, కోర్టులు ఉన్నాయి" అని ఆర్టీసీ ఐకాస నాయకులు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెకు మద్ధతుగా ఉద్యోగులు పెన్ డౌన్ చేయాలని అశ్వత్థామ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం చట్టబద్ధమైన కమిటీ వేసి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణ చేపడతామని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.