Telangana: తెలంగాణలో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది నియామకాలకు సీఎం కేసీఆర్ ఆదేశం, డెలివరీ బాయ్స్‌కు వ్యాక్సినేషన్ చేపట్టాలని కేంద్రానికి సూచన, ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు
Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, May 10: రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై కొంతమేర పని ఒత్తిడి తగ్గించడం కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో నూతన వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా సమయంలో వారి సేవలను వినియోగించుకోవాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. వీరికి గౌరవప్రదమైన వేతనంతో పాటు, కరోనా లాంటి ఆపత్కాలంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపునివ్వాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సీఎం ఆదేశించారు.

కష్టకాలంలో ప్రజలకోసం సేవచేయడానికి ముందుకు రావాలని యువ డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఆసక్తి ఉన్న వాళ్లు ఆన్ లైన్లో (https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx) దరఖాస్తు చేసుకోవాలని సీఎం తెలిపారు. డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హత ఉన్న నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజిఎం కు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్ జిల్లా రిమ్స్ లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పి.ఎం.ఎస్.ఎస్.వై కింద ఎంజిఎంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటా కింద తక్షణం అందచేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్ లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ప్రభుత్వ వాటాకింద 20 కోట్ల రూపాయలను, మొత్తం 28 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. అదే సందర్భంలో వరంగల్ దవాఖానా కోసం 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్య సిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు.

ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆక్సీజన్ కొరత లేదని, రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోనే ఉన్నాయని, ఇతర మందులన్నింటినీ సిద్ధంగా ఉంచామని వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెత్తం 7393 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, 2470 ఆక్సీజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మందులతో పాటు, వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాయన్నారు. కాగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లను మరింతగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లను చేయాని సీఎం సూచించారు.

ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తో ఫోన్లో మాట్లాడారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. కరోనా వ్యాప్తిని పెంచే అవకాశం ఉన్న ‘సూపర్ స్ప్రెడర్’ లను గుర్తించి వారికి ముందువరసలో టీకాలు వేస్తే బాగుంటుందని సీఎం సూచించారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ ను డెలివరీ చేసే బాయ్స్, స్ట్రీట్ వెండర్స్, పలు దిక్కులకు పోయి పనిచేసే కార్మికులు తదితరులను కరోనా వ్యాప్తి సూపర్ స్ప్రెడర్లుగా ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వాక్సిన్ ను అందచేసేందుకు నిబంధనలను సడలించాలన్నారు. ఆ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించడం ద్వారా కరోనా వ్యాప్తిని అధికభాగం అరికట్టే అవకాశాముంటుందని సీఎం తెలిపారు. సీఎం సూచనలమీద సానుకూలంగా స్పందించిన కేంద్రం మంత్రి ప్రధానితో చర్చించి ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇదిలా ఉంటే, రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రైవేటు టీచర్లకు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్ననేపథ్యంలో, మిగిలిన మరో 80 వేల మంది ప్రైవేటు టీచర్లకు సిబ్బందికి కూడా వారికి అందిస్తున్న విధంగా 2000 వేల రూపాయాలను 25 కిలోల బియ్యాన్ని అందచేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.