CM KCR Review: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష, గురు- శుక్ర వారాల్లో జరిగే కేబినేట్ భేటీపై చర్చ, డిపోల వద్ద కొనసాగుతున్న కార్మికుల ఆందోళనలు
TSRTC stir | File Photo

Hyderabad, November 26: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ (CM KCR) సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్టీసీనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రూట్ల ప్రైవేటీకరణ (TSRTC Privatization) అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం (Cabinet Meet) ఉంటుందని సీఎం కార్యాలయం ఇదివరకే ప్రకటించింది. ఆ తర్వాత రోజూ 29న కూడా కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొంది. నూతన రెవెన్యూ చట్టం, ఇతర అంశాలతో పాటు ఆర్టీసీ అంశంపైనే ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినేట్ మీటింగ్ లో చర్చించనున్నారు.

ఈనేపథ్యంలో కేబినేట్ చర్చ సందర్భంగా రూట్ల ప్రైవేటీకరణ విషయంలో పొందుపరచవలసిన అంశాలపై, అలాగే కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే పరిస్థితుల్లో ఎలాంటి షరతులు విధించాలి, మరోసారి సమ్మెకు వెళ్లకుండా మరియు ప్రైవేటీకరణ విషయంలో కార్మికులు సమస్యగా మారకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు.

మేమేం తప్పు చేశాం? ఎందుకు మాకింత శిక్ష?

 

ఇదిలా ఉండగా, తెలంగాణ వ్యాప్తంగా గల 97 ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల ఆందోళనలు, పోలీసుల అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. 52 రోజుల తర్వాత సోమవారం సాయంత్రం సమ్మె విరమించిన కార్మికులు, ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెల్లవారు ఝామున 5 గంటల నుంచే డిపోలకు రావడం మొదలు పెట్టారు. అయితే ఎప్పుడంటే అప్పుడు విధులను బహిష్కరించడం, ఎప్పుడంటే అప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ అంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిపోల వద్ద పోలీసు బలగాలతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న ప్రైవేట్ సిబ్బందిని మినహాయించి ఎవరు డిపోల వైపు వచ్చినా పోలీసులు వారి అరెస్ట్ చేసి అక్కడ్నించి పంపించివేస్తున్నారు.  ఈ క్రమంలో పోలీసులు -కార్మికులకు మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మేమేం తప్పు చేశాం, ఎందుకు ఈ ప్రభుత్వం మాకు ఇంత శిక్ష విధిస్తుంది అంటూ పలుచోట్ల మహిళా ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

పరిస్థితి తీవ్రతను బట్టి పలుచోట్ల పోలీసులు 144 సెక్షన్ కూడా విధించారు. ఈ ఆందోళనలతో కొంతమంది కార్మికులు గుండెపోట్లను కొని తెచ్చుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం మంగళ్ పాడ్ గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాజేంధర్ (55) ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు.