TSRTC Strike | CM KCR Review | File Photo

Hyderabad, November 25:  ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది, కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం సాధ్యం కాని పని అని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. రేపట్నించి విధుల్లో చేరుతున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆర్టీసీ ఎండీ అన్నారు. కార్మికులు తమ ఇష్టం వచ్చినప్పుడు సమ్మెకు వెళ్తాం, ఇష్టం వచ్చినప్పుడు విధుల్లోకి చేరతాం అనడం సరికాదు. దేశంలో ఎక్కడాలేని విధంగా కార్మికులు సమ్మెకు వెళ్లారు. పండగల సమయంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని సునీల్ శర్మ తెలిపారు. యూనియన్ల మాటలు విని కార్మికులు నష్టపోయారని, ఇకపై యూనియన్ల మాట వినకుండా కార్మికులు నడుచుకోవాలని హెచ్చరించారు. కార్మిక శాఖ నిర్ణయం వరకు సంయమనం పాటించాలని స్పష్టం చేశారు.

హైకోర్ట్ ఆదేశానుసారం సమ్మె విషయంలో కార్మిక శాఖ తగు నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారంగానే నడుచుకుంటుందని పేర్కొన్నారు. లేబర్ కోర్టులో తేలిన తర్వాతనే కార్మికులను చేర్చుకోవాలా, వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. అయితే ఇంతలోనే వారికి  ప్రభుత్వం నుంచి షాక్ తగిలింది.

ప్రస్తుతం సీఎం కేసీఆర్, పూర్తిగా రూట్ల ప్రైవేటీకరణపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. హైకోర్ట్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ విధానం అమలుపై గవర్నరుతో కూడా రెండు గంటల పాటు సీఎం చర్చించారు. గవర్నర్ తో భేటీ ముగిసిన అనంతరం ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరమణ చేసిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం ఒక ప్రకటన చేస్తారని కార్మికులందరూ అతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో సీఎం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోగా, ఆయనతో భేటీ అనంతరం ఎండీ సునీల్ శర్మ ఈ ప్రకటన చేశారు. దీనిని బట్టి ప్రభుత్వం ఇక కార్మికుల పట్ల కఠినంగానే వ్యవహరించనున్నట్లు అర్థమవుతుంది.  సీఎం నిర్ణయం వెలువడక ముందే బస్ డిపోలకు ఆర్టీసీ కార్మికులు

సమ్మె ముగింపుకు వచ్చిందనుకున్న తరుణంలో ఆర్టీసీ ఎండీ ప్రకటన, అటు కార్మికులను ఇటు జేఏసీ నేతలను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసింది. రేపు ఉదయం 6 గంటల నుంచే విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించిన జేఏసీ నేతలు ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, రేపట్నించి ఈ పరిణామం ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందో చూడాలి.

గతంలో రెండు సార్లు విధులకు హాజరుకమ్మని సీఎం కేసీఆర్ స్వయంగా పిలుపునిచ్చారు.   సీఎం గతంలో విధించిన డెడ్‌లైన్ ఈ లింక్‌లో చూడొచ్చు.  ఒకవేళ రాని పక్షంలో తిరిగి ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి చేర్చుకోమని హెచ్చరించారు కూడా. అనుకున్నట్లే గతంలో చెప్పిన మాటకే సీఎం కట్టుబడినట్లు తెలుస్తుంది. ఇక ముందు ఎవరైనా సమ్మెకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తుంది. ఆర్టీసీ ఎండీ తాజా ప్రకటన అలాంటి హెచ్చరికనే కార్మికవర్గాలకు పంపిస్తుంది.

ఆర్టీసీ జేఏసీ ప్రకటన ఇలా ఉంది

కొద్ది సేపటి క్రితమే ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ (TSRTC JAC) నేతలు, అకస్మాత్తుగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కార్మికులందరూ రేపట్నించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బంది, రేపట్నించి విధులకు హాజరుకానవసరం లేదని స్పష్టం చేశారు.

కార్మికుల శ్రేయస్సు కోసం, తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె విరమించామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Rdeddy) తెలిపారు. ఈ సందర్భంగా "ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదు, ప్రభుత్వం గెలవలేదు" అంటూ వ్యాఖ్యానించారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఇక తాము సమ్మె విరమించినందున ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.