Hyderabad, Feb 10: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నల్లగొండ జిల్లాలో (CM KCR Nalgonda Tour) పర్యటించనున్నారు. ఉదయం 11:45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నల్లగొండకు బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 12:30 నందికొండకు చేరుకోనున్నారు. అక్కడ్నుంచి 12:40 గంటలకు రోడ్డుమార్గాన నెల్లికల్లుకు వెళ్లనున్నారు. 12:45 గంటలకు నెల్లికల్లులో 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒకే చోట శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం 12:55 గంటలకు నాగార్జునసాగర్ (Nagarjuna Sagar Constituency) చేరుకుంటారు. ఒంటిగంటకు హిల్ కాలనీ చేరుకొని.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో కేసీఆర్ లంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం 3:10 గంటలకు హాలియా బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. సాయంత్రం 4:10 గంటలకు కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.
ఇదిలా ఉంటే త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సీఎం టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో అప్రమత్తమైన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచనున్నారు.
నోముల నర్సింహయ్య మరణంతో సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు, దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. నాగార్జునసాగర్‌పైనా కన్నేసింది. మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లు చేయించగా, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పనులను పరిశీలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కార్యకర్తలు, రైతులను పెద్ద ఎత్తున ఈ సభ కోసం సమీకరిస్తున్నారు.