CM Review On Rains: తెలంగాణలో కుంభవృష్టి, భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష, సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన
Heavy Rains (Photo-Twitter)

Hyderabad, July 23: తెలంగాణలో గడిచిన రెండు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి, ఎగువన మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయాలకు వరద పోటేత్తింది. అన్ని ప్రాజెక్టుల్లోనూ కెపాసిటీకి మించి నీరు చేరడంతో, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే అధికారులు కిందకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలు పరివాహాక ప్రాంతాలు నీట మునిగాయి.

నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో ఇలాంటి వర్షం ఎప్పుడూ చూడలేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు, సూచనలు చేశారు. భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తడిసిముద్దైంది. జలపాతాలు పూర్తిగా నిండుకొని వరదల్లా పొంగిపొర్లుతున్నాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 27.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి, రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు విపరీతమైన పంటనష్టం వాటిల్లింది.

ఎగువ రాష్ట్రాల్లో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో వర్షపాతం నమోదు తీరును, ఎస్సారెస్పీపై నుంచి మొదలుకుని కడెం, ఎల్లంపల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజ్ ల పరిధిలో వరద పరిస్థితిని, కృష్ణ ఎగువన పరిస్థితిని సీఎం కేసీఆర్ ఆరా తీసారు. గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరియు నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి

➧ తక్షణమే కొత్తగూడెం, ఏటూరు నాగారం, మంగపేట ప్రాంతాల్లో పర్యవేక్షణకు, ఆర్మీ చాపర్ లో సీనియర్ అధికారులను పంపించాలి.

➧ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు తక్షణమే పంపించాలి. లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు రక్షణ చర్యలు చేపట్టాలి. నిరాశ్రయులకు, షెల్టర్, బట్టలు, భోజన వసతులు ఏర్పాటు చేయాలి.

➧ రేపు, ఎల్లుండి పరిస్థితిని ఎదుర్కోవడానికి మరిన్ని చర్యలు చేపట్టాలి. ఇరిగేషన్, ఎలెక్ట్రిసిటీ, పోలీస్ తదితర శాఖలను సంసిద్ధం చేయాలి.

➧ లోతట్టు ప్రాంతాల ప్రజలను షిఫ్ట్ చేసి రక్షణ చర్యలు చేపట్టాలి.

➧ రిజర్వాయర్ లు, ప్రాజెక్ట్ ల నుండి నీటిని నెమ్మదిగా వదలాలి.

➧ ఏడు, ఎనిమిది మందితో కూడిన ఫ్లడ్ మేనేజ్ మెంట్ టీమ్ ను పర్మినెంట్ గా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం వరదల రికార్డ్ ను పాటించాలి. పాత రికార్డ్ ను అనుసరించి ఆయా వరద సమయాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి.

➧ మూసీ నది వరద గురించి ఆరా తీసిన సీఎం. వరద ఉధృతి పెరిగే పరిస్థితి ఉంటే, మూసీ లోతట్టులో నివాసముంటున్న ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

➧ హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన సీఎం. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని హెచ్.ఎం.డి.ఎ, జీ.హెచ్.ఏం.సీ అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

➧ డ్రైనేజీ పరిస్థితుల మీద ఆరా తీసిన సీఎం, తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

➧ మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇక నుంచి కరువు పరిస్థితులు వుండవని, వరద పరిస్థితులను ఎదుర్కునే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఉన్నతాధికారులకు సీఎం సూచించారు.

➧ కృష్ణా నదీ ప్రవాహం కూడా పెరిగే పరిస్థితి వున్నందున నాగార్జున సాగర్ కు ఉన్నతాధికారులను పంపించాలి.

➧ మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రప్పించాలి. హెలికాప్టర్ లను మరిన్ని తెప్పించాలి.

➧ గతంలో వరదల పరిస్థితులను ఎదుర్కున్న అధికారులను వినియోగించుకోవాలి.

➧ మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతమైన వర్షాలు, మహాబలేశ్వరంలో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద పెరిగితే తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలి.

➧ తక్షణమే "వరద నిర్వహణ బృందం" (ఫ్లడ్ మేనేజ్మెంట్ టీమ్) ను ఏర్పాటు చేయాలి. ఇందులో వరదలు ఉత్పన్నమైన సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల మీద అవగాహన కల్పించబడిన అధికారులను నియమించాలి.

➧ ఇందులో సభ్యుల్లో ఒకరు రిహాబిలిటేషన్ క్యాంప్ లను నిర్వహించడంలో అవగాహన కలిగి వుండాలి. ఆర్మీ, పోలీస్, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థలను అప్రమత్తం చేసుకోవడానికి ఒక అధికారి, వైద్య శాఖ, ఆర్&బి శాఖ, పంచాయితీ రాజ్ శాఖను సమన్వయం చేసుకోగల అనుభవం వున్న అధికారిని నియమించాలి.

➧ జీఏడి, రెవెన్యూ, నీటిపారుదల శాఖ తదితర ఫ్లడ్ చర్యల్లో పాల్గొనే వ్యవస్థలను సమన్వయం చేసుకోగలిగే అధికారి. ఇట్లా వరద పరిస్థితిని ఎదుర్కునేందుకు శిక్షణ పొందిన అధికారులతో కూడిన టీమ్ ను శాశ్వత ప్రాతిపదికన తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

➧ ఆగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి వున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజా రక్షణ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

➧ ఆర్&బీ శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి అన్ని ఇతర శాఖలతో సమన్వయం అవుతూ బ్రిడ్జీలు, రోడ్ల పరిస్థితులను పరిశీలించి ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలన్నారు.

➧ రాష్ట్ర ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని స్వీయ నియంత్రణ పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు, చెరువుల వైపు సంచరించకూడదని, వరద ఉధృతిలో వాగులు, వంకలు దాటేందుకు సాహసకృత్యాలకు పాల్పడకుండా ఉండాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు.