File image of Telangana CM KCR | File Photo

Hyderabad, May 21: ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వరంగల్ లోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స విధానం, ఇతర సౌకర్యాలు పరిశీలించేందుకు బుధవారం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం, రాష్ట్రంలోని మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తూ వాటిల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు భరోసా కల్పించాలని సీఎం సంకల్పించారు. ఈ క్రమంలో ఆయన నేడు వరంగల్ పర్యటనకు బయలు దేరనున్నారు.

ఈరోజు ఉదయం హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ్నించి రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు ఇంటికి వెళ్తారు. అక్కడ్నించి 11:45 గంటలకు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీకి సమీపంలో ఉన్న ఈ జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జైలు పరిసరాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.

అనంతరం లక్ష్మీకాంత రావు ఇంట్లో లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సీఎం ఎంజీఎం ఆసుపత్రిని సందర్శిస్తారు. అక్కడి వసతుల, సౌకర్యాలను పరిశీలిస్తారు. కోవిడ్ బాధితులతో మాట్లాడుతూ సీఎం వారిలో ధైర్యాన్ని నింపనున్నారు.

ఈ పర్యటనలో జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మరియు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.

ఇదిలా ఉంటే, నిన్న తెలంగాణలో 69,252 కరోనా టెస్టులు నిర్వహించగా 3,660 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,44,263కి చేరుకుంది. మరో 23 మంది కోవిడ్ కారణంగా మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 3,060కు పెరిగింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,95,446 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 మంది ఆసుపత్రుల్లో మరియు ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.