Hyderabad, June 27: తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని (Revanth Reddy as New TPCC Chief) అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ తన చురుకుదనం, పోరాటనైజం వంటి కారణాలతో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నాడు. బయటి నుంచి వచ్చిన వాళ్లకు పీసీసీ పదవి ఎలా ఇస్తారంటూ వీహెచ్ వంటి నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించినప్పటికీ నూతన పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి (Parliamentarian, A Revanth Reddy) వైపే సోనియా గాంధీ మొగ్గు చూపారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఐదుగురిని నియమించింది. జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఓ ప్రకటనలో పేర్కొంది. పీసీసీ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పోదెం వీరయ్య, సురేశ్, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్ లను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలపై ఇన్నాళ్లుగా నాన్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు నిర్ణయాన్ని ప్రకటించి అనిశ్చితికి తెరదించింది.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా (Revanth Reddy appointed TPCC chief) ఎన్నికైన తర్వాత గత రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగ యువత, రైతుల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నమ్మకాన్ని నిలబెడతానని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.
పార్టీలోని సీనియర్లు, పెద్దల సహకారంతో ముందుకు సాగుతానని రేవంత్ పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్లు అయిన జానారెడ్డి, హన్మంతరావు వంటి వారిని కలిసి వారి సలహాలు, సూచనలు, ఆలోచనల మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీలోని భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కావని కొట్టిపడేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని రేవంత్ విమర్శించారు. ఈటలను బీజేపీలోకి పంపింది కేసీఆరేనని అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమాలను చేపడతామని రేవంత్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించిన కాసేపటికే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్) పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి గత రాత్రి లేఖ పంపారు. తెలంగాణ పార్టీ చీఫ్‌గా నియమితులైన తర్వాత గత రాత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ సీటును తనకు ఇవ్వాలని చెప్పిందే లక్ష్మారెడ్డి అని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఆయన తనకు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.