Hyderabad, June 26: తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభమవనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ శనివారం మరోసారి స్పష్టం చేసింది. జులై 1 నుంచి (Telangana schools, colleges to reopen from July 1) ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రరెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని కేసీఆర్ అన్నారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని సూచించారు.
వెంటనే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సబితా ఇంద్రారెడ్డికి (sabitha Indra Reddy) కేసీఆర్ ఆదేశించారు. అయితే ప్రత్యక్ష బోధన కాకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే తరగతుల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించింది. 9, 10 తరగతులకు కూడా ఆన్‌లైన్‌లోనే బోధన నిర్వహించనుంది. 50 శాతం టీచర్లు ఒకరోజు.. మరో 50 శాతం టీచర్లు తర్వాతి రోజు హజరయ్యేలా చూడనున్నారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో జీవో జారీ అయ్యే అవకాశం ఉంది.
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యాక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించిన ముఖ్యమంత్రి.. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, హరితహారం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి, రైతుకు యంత్రాంగం అండగా నిలబడాలని సూచించారు. ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను రిజిస్ర్టేషన్ చేయాలి. పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లపై రిజిస్ర్టేషన్ చేయాలి. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ శాఖ, పోలీసులు కల్తీ విత్తనాలను అరికట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలు వాడాలన్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులు గుర్తించాలని చెప్పారు. అటవీ భూముల హద్దులు గుర్తించాలని అటవీశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్ ఐఏఎస్ లు, డీఎఫ్ఓలు, కన్జర్వేటర్లు, డీపీవోలు, డీఆర్ డీవోలు, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు హాజరయ్యారు.
.