Telangana: తెలంగాణలో 1454కు పెరిగిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, హైదరాబాద్‌లో తగ్గని కరోనా తీవ్రత, సుదీర్ఘంగా పరిస్థితులను సమీక్షించిన సీఎం కేసీఆర్,  ఈనెల 17 వరకు యధావిధంగా లాక్డౌన్ అమలు
COVID19 Lockdown in Telangana. | Photo: Twitter

Hyderabad, May 15: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా మరో 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1454కు చేరింది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో 33 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 7గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈరోజు మొత్తంగా 13 మంది కోవిడ్-19 పేషెంట్లు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 959 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. రాష్ట్రంలో కరోనా బాధితులు ఎక్కువ సంఖ్యలో కోలుకుంటుండం కొంత ఊరట కలిగించే విషయం. కరోనా సోకి, వయసు పైబడిన వారు అయుండి, ఇతరత్రా ఆనారోగ్య కారణాలు ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అలా రాష్ట్రంలో 34 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈరోజైతే ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 461 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

 

సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి పూర్తిగా కట్టడి చేయబడినా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల మాత్రమే ప్రతీరోజు కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇదే విషయమై సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో వైరస్ వ్యాప్తి కట్టడి చేసే వ్యూహాలతో పాటు ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లలో లాక్డౌన్ సడలింపులపై చర్చించారు.

అయితే హైదరాబాద్ లో కేవలం 4 జోన్లలోనే వైరస్ వ్యాప్తి ఉందని సీఎం కేసీఆర్ తన సమీక్షలో వెల్లడించారు. ప్రస్తుతానికి లాక్డౌన్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.కేంద్ర ప్రభుత్వం విధించిన మూడో ఫేజ్ లాక్డౌన్ ఈనెల 17తో ముగియనుంది, ఆ తర్వాత నాలుగో ఫేజ్ లాక్డౌన్ కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసే ఉన్న నేపథ్యంలో వాటినే రాష్ట్రంలోనూ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పై స్పష్టత ఈ ఆదివారం వచ్చే అవకాశం ఉంది.