
Hyderabad, May 11: ఇప్పటికే కరోనా ప్రభావంతో భారీగా ఆదాయాన్ని కోల్పోయిన టీఎస్ఆర్టీసీ (TSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రయాణికులు బస్సులను ఎక్కేందుకు ఆసక్తి చూపకపోవడంతో ప్యాసింజర్ సర్వీసులను తగ్గించుకున్న టీఎస్ఆర్టీసీ (Telangana State Road Transport Corporation (TSRTC) తాజాగా పార్శిల్, కార్గొ సర్వీసుల సేవలను (cargo-parcel-service) తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పొరుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌తో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
పరిస్థితులు కుదుటపడే వరకు కార్గో సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపారు. త్వరలోనే సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు అందిస్తున్నది. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్ అమల్లో ఉన్నది. నష్టాల నుంచి బయటపడేందుకు గతేడాది జూన్ 19న టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించింది. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నది.
రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. ప్రగతిభవన్‌లో జరుగనున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్ విధింపుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.