Hyderabad, May 11: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధింపుపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నా కూడా అది ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని, కేసులు ఏమాత్రం తగ్గడం లేదని రిపోర్టులు అందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదే సమయంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్‌డౌన్ కచ్చితంగా పెట్టాలి అని కోరుకుంటుండగా, మరికొన్ని సామాన్య వర్గాల ప్రజలు లాక్‌డౌన్ వల్ల తమ ఉపాధి దెబ్బతింటుంది అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద లాక్‌డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశంపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది.
లాక్‌డౌన్ పట్ల ఎలాంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అయితే కట్టడి అవసరం అని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నానికి రాష్ట్రంలో లాక్‌డౌన్‌పై స్పష్టత రానుంది.
Here's the update:
The State Cabinet will meet at 2 PM on Tuesday at Pragathi Bhavan. The Council of Ministers headed by CM Sri KCR will discuss on imposition of #lockdown in the State in the backdrop of continuing surge in #Covid19 cases.#TelanganaFightsCovid19
— Telangana CMO (@TelanganaCMO) May 10, 2021
ఇదిలా ఉంటే, పొరుగు రాష్ట్రాల నుంచి కరోనా రోగులతో వచ్చే అంబులెన్సులను తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లోనే అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మ్ అయిందని తెలిస్తే మాత్రం అనుమతి ఇస్తున్నారు. ఒకవైపు పొరుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘర్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కోవిడ్ రోగులు వైద్యం కోసం హైదరాబాద్ మరియు తెలంగాణలోని సరిహద్దు జిల్లాల ఆసుపత్రుల్లో చేరుతుండటంతో వారి తోనే తెలంగాణలోని ఆసుపత్రులు నిండిపోతున్నాయన్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల వెంబడి నిఘా మరియు పటిష్ఠమైన కట్టడి ఏర్పాటు చేసింది.