Coronavirus in Telangana: తెలంగాణాలో కరోనా కలవరం, 11 మంది మృతి, 334కు చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు, ఆదివారం ఒక్కరోజే కొత్తగా 62 కేసులు
COVID-19 Outbreak in Telangana | Photo: IANS

Hyderabad, April 6: తెలంగాణలో కరోనా వైరస్ (Coronavirus in Telangana) రోజురోజుకు తన ప్రతాపం చూపుతోంది. ఆదివారం కొత్తగా మరో 62 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో (Telangana) ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల 334కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ (Minister for Health Telangana State) విడుదల చేసింది.

మళ్లీ 14 కొత్త కేసులు, ఏపీలో 266కి చేరుకున్న కరోనావైరస్ కేసులు

శనివారం వరకు తెలంగాణలో 272 కేసులు నమోదుకాగా... ఆదివారం ఈ సంఖ్య మరింత పెరిగింది. మర్కజ్‌ లింకుతో తెలంగాణలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో నిన్న 480 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 62 మందికి పాజిటివ్‌ వచ్చింది. కాగా తెలంగాణలో ఇప్పటి వరకు కోవిడ్ 19 భారీనపడి 11 మంది చనిపోయారు. మరో 33 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో వారిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 283 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Here's Minister for Health Telangana State Tweet

ప్రస్తుతం తెలంగాణలోని 283 యాక్టివ్‌ కేసుల్లో హైదరాబాద్ బాధితులే ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 162 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒకరోజు వ్యవధిలోనే 51 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. 11 మంది డిశ్చార్జి అయ్యారు.

హైదరాబాద్‌ తర్వాత ప్లేస్‌లో వరంగల్‌ అర్బన్‌ నిలిచింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఇప్పటి వరకు 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్‌లో 19 మంది, నల్లగొండలో 13మంది, మేడ్చల్‌లో 12మంది, రంగారెడ్డిలో 11మంది, ఆదిలాబాద్‌లో 10మంది కరోనా బారిన పడ్డారు.

తెలంగాణలో గత నాలుగు రోజుల వ్యవధిలోనే 190 కేసులు నమోదయ్యాయి. మార్చి 31న 15 కేసులు, ఏప్రిల్‌ 1 నుంచి వరుసగా భారీగా కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో ఏకంగా ఒకేరోజు 75 కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 26 నుంచి రాష్ట్రంలో ఢిల్లీతో కనెక్ట్‌ అయిన కరోనా కేసులు బయటపడుతూ వస్తున్నాయి. దేశమంతా లాక్‌డౌన్‌ విధించే సమయానికి తెలంగాణలో ఐదారు జిల్లాల్లోనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.