Hyderabad, Jan 2: తెలంగాణలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదు అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య (Coronavirus in Telangana) 2,87,108కి చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. కరోనా మరణాల సంఖ్య మొత్తంగా 1,546కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 5,571 యాక్టివ్ కేసులుండగా.. 2,79,991 మంది కరోనా (Telangana coronavirus cases) నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీలో (GHMC) కొత్తగా 72 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కొనసాగుతున్నది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏడు కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, నాంపల్లి ఏరియా ఆస్నత్రి, తిలక్‌నగర్ యూపీహెలో, సోమాజిగూడ యశోద హాస్పిటల్, మహబూబ్ నగర్ జిల్లాలోని జానంపేట పీహెచ్‌సీ, మహబూబ్‌నగర్ జీజీహెచ్, నేహా షైన్ హాస్పిటల్‌లో డ్రైరన్ కొనసాగుతున్నది. ఒక్కో కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
టీకా ఇచ్చే సమయంలో క్షేత్రస్థాయి సమస్యలను అధికారులు పరిశీలిస్తారు. కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి వ్యాక్సినేషన్ ఇస్తారు. పోర్టల్ ధ్రువపత్రాలు సరిపోల్చుకుని టీకా ఇస్తారు. కరోనా టీకా తీసుకున్న తర్వాత అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలోనే వ్యాక్సినేటర్లు ఉండాల్సి ఉంటుంది. టీకా ఇచ్చిన తర్వాత శరీరంలో మార్పులను అధికారులు గుర్తిస్తారు. ఇలా శరీరంలో వచ్చే మార్పులను కొవిన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
తెలంగాణలోని సూర్యాపేటలో కరోనా భయాందోళనలను రేకెత్తించింది. ఒకే కుటుంబానికి చెందిన 22 మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని డీఎంహెచోఓ తెలిపారు. కుటుంబంలోని ఒక వ్యక్తి ఇటీవల ఒకరి అంత్యక్రియలకు వెళ్లి వచ్చారని, ఆయనకు కరోనా సోకిందని డీఎంహెచ్ఓ చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులకు కోవిడ్ పరీక్షలను నిర్వహించగా.. 22 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని ఆయన వెల్లడించారు.
అయితే వీరిలో కరోనా లక్షణాలు పెద్దగా లేవని, పరీక్షలు నిర్వహించిన తర్వాతే కరోనా అని తేలిందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీరికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో వైద్య సిబ్బంది ఉన్నారని తెలిపారు. కరోనా కేసుల నేపథ్యంలో సదరు కుటుంబం ఉన్న ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు.