Hyderabad, July 23: తెలంగాణలో కొవిడ్19 గుప్తంగా వ్యాపిస్తోంది. అయితే గత కొంతకాలంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న గణాంకాల ప్రకారం ఒక మోస్తారుగా వెయ్యి, పదిహేను వందల్లో కొత్త కేసులు వస్తున్నట్లు కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 1567 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 50,826 కి చేరుకుంది.
గురువారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 662 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల కాలంలో వచ్చిన కేసుల కంటే రెట్టింపు సంఖ్యలో 213 కేసులు వచ్చాయి. ఈరోజు మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కేసుల తీవ్రత కాస్త తగ్గింది. మేడ్చల్ నుంచి 33, సంగారెడ్డి నుంచి 32 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.
మరోవైపు జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. పలు జిల్లాల్లో ఈరోజు కూడా భారీగానే కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు వరంగల్ రూరల్ నుంచి కూడా 22 కేసులు నిర్ధారించబడగా, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 62, మహబూబ్ నగర్ జిల్లా నుంచి 61 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID Bulletin:
గురువారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 447 కు పెరిగింది.
అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 1661 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 39,327 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గత 24 గంటల్లో 13,367 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,22,326 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.