
Hyderabad, June 3: తెలంగాణలో కోవిడ్19 వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనైతే కరోనావైరస్ టాప్ గేర్లో ఉంది. బుధవారం కొత్తగా మరో 129 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 3020 చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 2572 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
బుధవారం కొత్తగా నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 108 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి 6, ఆసిఫాబాద్ నుంచి 6, మేడ్చల్ నుంచి 2, సిరిసిల్ల నుంచి 2 కేసులు రాగా, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
బుధవారం మరో 7 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం కలవరపాటుకు గురిచేసే విషయం. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 99కు పెరిగింది. ఇదిలా ఉంటే ఈరోజు మరో 30 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1556 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1365 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో 2 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు, 6 వేలకు చేరువలో మరణాల సంఖ్య
Telangana's #COVID19 Report:

బుధవారం రిపోర్ట్ లో మరో ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల్లో 206మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది. అలాగే ఇతర దేశాల నుంచి స్వదేశానికి చేరుకుని ప్రస్తుతం క్వారైంటైన్లో ఉన్నవారిలో 212 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరితో పాటు మరో 30 మంది విదేశీయులు కూడా పాజిటివ్ వచ్చిన వారి జాబితాలో ఉన్నారు. మొత్తంగా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 448 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.