Cyclone Michaung Live Updates: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన సైక్లోన్ మిచాంగ్ (Cyclone Michaung) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైన తుపాను గంటకు 8 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలపడి తీవ్ర తుపానుగా మారిందని తెలిపింది. మంగళవారం ఉదయం బాపట్ల దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
భూపాలపల్లి, జయశంకర్, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కూరుస్తాయని చెప్పింది. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.