Cyclone Michaung Update: నెల్లూరుకు దగ్గరలో మైచాంగ్ తుఫాను, కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, డిసెంబరు 4, 5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Cyclone Michaung (Photo Credits: X/@RainStorm_TN)

Cyclone Michaung Live Updates: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మైచాంగ్ తుఫాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలోనూ, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కి.మీ దూరంలోనూ, మచిలీపట్నానికి దక్షిణంగా 320 కి.మీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.

ఇది మరింత బలపడే అవకాశాలున్నాయని, క్రమంగా ఉత్తర దిశగా ఏపీ తీరానికి సమాంతరంగా పయనించి డిసెంబరు 5 మధ్యాహ్నం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపింది.

వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, ఎయిర్‌పోర్ట్‌లోకి భారీగా వరద, మిచాంగ్ తుఫాను విధ్వంసానికి చెన్నై ఎలా విలవిలలాడుతుందో వీడియోల్లో చూడండి

తీవ్ర తుపాను నేపథ్యంలో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డిసెంబరు 4, 5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు... డిసెంబరు 4న ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. డిసెంబరు 6న ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఇక, రాయలసీమలో డిసెంబరు 4న చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమలో డిసెంబరు 5న అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తెలంగాణపైనా 'మైచాంగ్ తుఫాను ప్రభావం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. డిసెంబరు 4న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉందని తెలిపింది. డిసెంబరు 5న చాలా ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయని, అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

చెన్నైను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల ధాటికి కొట్టుకుపోయిన కార్లు, వీడియో ఇదిగో..

తుపాను తీరం దాటే సమయంలో ఏపీ కోస్తా జిల్లాల్లో ఒకటిన్నర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మిచౌంగ్ తుఫాన్ తీవ్ర తుపాను ప్రభావం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలపై అత్యధికంగా ఉంటుందని తెలిపింది.

మిచౌంగ్ తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వివరాలలోకి వెళ్తే.. సోమవారం తెల్లవారుజాము నుండి చెన్నైలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరం లోని 14 రైల్వే సబ్‌వేల్లోకి వర్షపు నీరు చేరింది.

మిచౌంగ్ తుఫాను విలయతాండవం, 100 అడుగుల మేర ముందుకు దూసుకువచ్చిన సముద్రం, రేపు తుఫాను తీరం దాటే వరకు అల్లకల్లోలంగా సముద్రం

దీనితో నీరు చేరిన 14 రైల్వే సబ్‌వేలని మూసి వేశారు. కాగా మరో 24 గంటలపాటు చుట్టుపక్కల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన చెన్నై ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే చెన్నైలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. కాగా తాంబ్రం ప్రాంతంలో నీటిలో చిక్కుకొన్న 15 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి.

తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలు ఉద్రిక్త స్థాయికి చేరడంతో బాసిన్‌ బ్రిడ్జ్‌, వ్యాసర్‌పాడి మధ్యలోని బ్రిడ్జ్‌ నెం:14ను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలో పలు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఈ నేపధ్యంలో పాఠశాలలకు, నగరం లోని కోర్టులకు సెలవులు ఇచ్చినట్లు మద్రాస్‌ హైకోర్టు ప్రకటించింది.

కాగా వీలైనంత వరకు ప్రజలు బయటకు రాకుండా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరించారు. కాగా సోమవారం వర్షం కారణంగా చెన్నై-మైసూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, కోయంబత్తూర్‌ కోవై ఎక్స్‌ప్రెస్‌, కోయంబత్తూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, కేఎస్‌ఆర్‌ బెంగళూరు ఏసీ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌, కేఎస్‌ఆర్‌ బెంగళూరు బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలను నిలిపివేశారు. అలానే సబర్బన్‌ రైళ్లను కూడా రద్దు చేశారు.