Hyderabad, July 16: పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ కరోనా భారీన పడిన తెలంగాణ వాసిని (Coronavirus patient from Telangana) దుబాయ్ లోని ఓ ఆస్పత్రి యాజమాన్యం ఆదుకుని తన మానవత్వాన్ని చాటుకుంది. ఇందులో భాగంగా భారతీయునికి కరోనా చికిత్స కోసం అయిన రూ.1.52కోట్ల బిల్లును మాఫీ (Dubai Waived 1.52 Crore Corona Bill) చేసింది. అంతేకాకుండా ఫ్లైట్ టికెట్ ఇచ్చి, జేబులో రూ.10వేలు పెట్టి మరీ అతడిని ఇండియాకు పంపించింది. తెలంగాణలో కొత్తగా మరో 1597 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 40 వేలకు చేరువైన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, సుమారు 26 వేల మంది రికవరీ
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగమట్లకు చెందిన ఓడ్నాల రాజేష్(42) ఏప్రిల్ 23న దుబాయ్‌లో కరోనాతో ఆసుపత్రిలో చేరాడు. దాదాపు 80 రోజులపాటు హాస్పిటల్‌కే పరిమితమయ్యాడు. 80 రోజుల తరువాత కోలుకున్న అతడికి రూ.1.52కోట్ల బిల్లు అయ్యింది. అయితే తనకు అంత డబ్బు కట్టే స్థోమత లేదని ఆ వ్యక్తి విన్నవించుకున్నారు. ఇక ఈ విషయం కాస్త ఇండియా కాన్సులేట్ దగ్గరగా వెళ్లగా.. వారి విఙ్ఞప్తితో ఆసుపత్రి యాజమాన్యం అతడి బిల్లును మాఫీ చేసింది.
ఆ తరువాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసి, డబ్బులు ఇచ్చి రాజేష్‌ని భారతదేశానికి పంపింది. ఈ క్రమంలో రాజేష్ బుధవారం హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఇక ఆయనను 14 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు ఎన్నారై సెల్ సీనియర్ అధికారి చిట్టి బాబు పేర్కొన్నారు. కాగా తనపై దుబాయ్ ఆసుపత్రి చూపిన ఉదారతకు రాజేష్ వారికి తన కృతఙ్ఞతలను తెలిపారు.
ఈ విషయంలో దుబాయ్‌లోని గల్ఫ్ కార్మికుల రక్షణ సంఘం (Gulf Workers Protection Society) అధ్యక్షుడు నరసింహ అతనికి సాయమందించాడు. అతనే ఏప్రిల్ 2న దుబాయ్‌లోని అల్ ఖలీజా రోడ్‌లో ఉన్న హాస్పిటల్‌లో చేర్పించారు. అంతేకాకుండా విషయాన్ని దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ వాలంటరీ సుమంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వీరంతా కలిసి ఈ విషయాన్ని దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ (లేబర్)లో పని చేస్తున్న రాయబారి హర్జిత్ సింగ్‌కు అతడి పరిస్థితిని వివరించారు. స్పందించిన హర్జిత్ హాస్పిటల్ యాజమన్యానికి లేఖ రాయడంతో.. సానుకూలంగా స్పందించిన హాస్పిటల్ బిల్లు మొత్తాన్ని మాఫీ చేసింది. అతడు హైదరాబాద్ రావడానికి సాయం కూడా చేసింది.