
Hyderabad, July 15: తెలంగాణలో ఈరోజు కూడా భారీగానే కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 1597 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 39,342కి చేరుకుంది.
అత్యధిక కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయినప్పటికీ, ఇతర జిల్లాల్లో కూడా కేసులు భారీగా పెరగడం ప్రజలను కొంత ఆందోళనకు గురిచేసే విషయం. బుధవారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 796 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది.
ఇక నగరానికి సమీప ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా నుంచి ఈరోజు అత్యధికంగా 212 కేసులు రాగా, మేడ్చల్ నుంచి 115, సంగారెడ్డి నుంచి 73 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి. అలాగే మరొకొన్ని జిల్లాల నుంచి కూడా ఈరోజు పెద్దమొత్తంలోనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండ నుంచి 58, వరంగల్ అర్బన్ నుంచి 44, కరీంనగర్ నుంచి 41 కేసులు రావడాన్ని బట్టి చూస్తే కరోనా ఇతర జిల్లాల్లోను వేగంగా వ్యాపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. అనవసర ప్రయాణాలు, బయట తిరగడాలు మానేయటం ఎంతో మంచిది. కరోనాకు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా చికిత్స, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
TS's COVID Bulletin:

మరోవైపు గత 24 గంటల్లో మరో 11 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 386 కు పెరిగింది.
అయితే రాష్ట్రంలో కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం. ప్రతీరోజు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా వందల్లో ఉంటోంది. బుధవారం సాయంత్రం వరకు మరో 1159 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 25,999 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,958 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలు 2 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 13,642 సాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పటివరకు 2,08,666 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.