
Hyderabad, July 15: తెలంగాణలో కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కరోనా పరీక్షలు ఉచితంగా (Corona Free Treatment in TS) చేయడంతోపాటు, చికిత్సను కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. వీటిలో ఇకపై కరోనా పరీక్షలతోపాటు, కరోనా చికిత్సను ఉచితంగా అందించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. హైదరాబాద్‌లో 13 రోజుల్లో దాదాపు 15 వేల కరోనా కేసులు, జీహెచ్‌ఎంసీలో రోజుకు సగటున 1000 పాజిటివ్ కేసులు, ఈ నెలలో రికార్డు స్థాయిలో కోవిడ్-19 కేసులు
తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ మరింత టెర్రర్ సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పోలీసులు, నటులు కూడా ఈ వైరస్ బారిన పడుతూండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37,745 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 375 మంది మరణించారు. మంగళవారం 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి కోలుకుని 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24,840 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే కరోనా బారినపడి మంగళవారం 10 మంది మరణించారు.