Hyd, Nov 10: దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ (Dubbaka By-Poll Result 2020) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమయింది. మధ్యాహ్నం 12 గంటలలోగా తుది ఫలితం (Dubbaka By-election Result 2020) వెలువడే అవకాశం ఉంది. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 315 పోలింగ్ బూతుల్లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్ శాతం నమోదైంది. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది.
అన్నిరకాలుగా భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రతీ రౌండ్ కు సంబంధించిన కౌంటింగ్ వారీగా ఎంట్రీలు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. అదే విధంగా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో వీడియో గ్రఫీ చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్ర ఆవరణలో మీడియా రూమ్ ఏర్పాటు చేసి రౌండ్ వారీగా కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు చెప్పారు. కౌంటింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత వెబ్‌సైట్‌లో రౌండ్ వారీగా పొందుపరుస్తామని వివరించారు. కౌంటింగ్ చేపట్టే అధికారిక సిబ్బంది నియామకం, వారికి శిక్షణ సైతం పూర్తయినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కావాల్సిన వివిధ శాఖల అధికారిక సిబ్బంది నియామకం, శిక్షణ సైతం పూర్తయ్యిందని, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపును చేపట్టాలని అధికార వర్గాలకు ఆదేశించినట్లు తెలిపారు.
ప్రతి టేబుల్‌ను ఓ మైక్రో అబ్జర్వర్స్‌తోపాటు మిగతా అధికారులు పర్యవేక్షించనున్నారు. టేబుళ్ల వద్ద జరిగే లెక్కింపు పర్యవేక్షణ బాధ్యతలను ఏఆర్వోలకు అప్పగించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును తాసిల్దార్, ఎంపీడీఓ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 357 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. సిద్దిపేట పట్టణంలో కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో పికెట్స్, టియర్ గ్యాస్ బృందాలు, కౌంటింగ్ కేంద్రం, పరిసర ప్రాంతాల్లో రూఫ్ టాప్ అబ్జర్వేషన్ బృందాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ జోయల్ డేవిస్ తెలిపారు.
దుబ్బాక ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. మొత్తం 1453 పోస్టల్ బ్యాలెట్స్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ తిరిగి గెలిస్తే దుబ్బాక నియోజకవర్గ చరిత్రలో తొలి మహిళా ఎమ్మెల్యేగా సోలిపేట సుజాతారామలింగారెడ్డి రికార్డు సృష్టించనున్నారు. అదే బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావుకు అనుకూలంగా ఫలితాలు వెలువడితే ఉద్యమగడ్డపై కాషాయపు జెండా ఎగురుతుంది.