
Dubbaka, Nov 10: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో (Dubbaka By-Election Result 2020) టీఆర్ఎస్‌కు బీజేపీ షాక్ ఇచ్చేలా ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు (M Raghunandan Rao) 2,684 ఓట్ల ఆధిక్యంలో ఉండడం గమనార్హం. దుబ్బాకలో ఇప్పటి వరకు 28,074 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. బీజేపీ 13,055, టీఆర్ఎస్ 10,371, కాంగ్రెస్ 2,158 ఓట్లతో ఉన్నాయి. అంతకుముందు మూడో రౌండ్‌లోనూ బీజేపీకి ఆధిక్యం ప్రదర్శించింది.
టీఆర్ఎస్ కంటే 1,885 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ మూడో రౌండ్‌లో నిలిచి, నాలుగో రౌండ్‌లో మరింత దూకుడు కనబర్చారు. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
దుబ్బాకలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో తప్ప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత (Solipeta Sujatha) మూడు రౌండ్లలో ఎక్కడా ముందంజలో కనిపించలేదు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మాత్రం ఓట్ల జాడ అసలే కనిపించలేదు. మొదటి, రెండవ, మూడవ, నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం చూపడంతో ‘దుబ్బాక మనదే’ అన్నట్లుగా రాష్ట్ర కమలనాథులకు పూర్తిగా ధీమా వచ్చేసింది. మరోవైపు బీజేపీ పెద్దలు కొందరు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు కూడా చేయడం ప్రారంభించారు.