Dubbaka, Oct 27: తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికల్లో (Dubbaka bypoll) నిబంధనలకు విరుద్దంగా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్దిపేటలో డబ్బు నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం మూడు చోట్ల సోదాలు నిర్వహించగా డబ్బులు దొరికాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విజయ్ సాగర్, పోలీసు సిబ్బంది కలిసి... మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సుతోపాటు రఘునందన్‌రావు (ragunandhan Rao) బంధువులు సురుభి అంజన్‌రావు, సురభి రాంగోపాల్‌రావు ఇళ్లలో సోదాలు చేశామని చెప్పారు.
ఈ సందర్భంగా అంజన్‌రావు (BJP candidate's relative) ఇంట్లో రూ. 18.67 లక్షలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ సోదాల్లో ప్రతీది రికార్డు చేశామన్నారు. అయితే విషయం తెలుసుకున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 250 మంది అనుచరులతో పోలీసులపై దాడి చేసి రూ. 12.80 లక్షలు తీసుకెళ్లారని పోలీస్ కమిషనర్ చెప్పారు. వీడియో ఫుటేజీల ద్వారా వీరిని గుర్తించి రికవరీ చేస్తామని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. డబ్బు విషయంపై ప్రశ్నించగా జితేందర్‌రావు డ్రైవర్ తెచ్చి ఇచ్చాడని, ఈ డబ్బులను కొద్దికొద్దిగా దుబ్బాకకు పంపించేందుకు ఇక్కడ పెట్టామని స్వయంగా అంజన్‌రావు చెప్పిన వాగ్మూలం రికార్డు చేశామని సీపీ జోయల్ డేవిస్ వివరించారు.
ఈ విషయంపై సిద్ది పేట ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల్లో గెలువలేమని తెలుసుకున్న బీజేపీ నాయకులు (BJP) అడ్డదారిలో వెళ్లి ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ నాయకత్వంపై విశ్వాసం తగ్గిపోయి వారంతా బయటకు పోతున్న క్రమంలో బీజేపీ నేతలు సహనం కోల్పోయి మాట్లడుతున్నారని టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) విమర్శించారు. రఘునందన్ రావు బంధువుల ఇళ్లల్లో పోలీసులు చేసిన సోదాలపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించిన మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరిగినా బీజేపీ నేతలు మారలేదని, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Here's ANI Update
#WATCH: Ruckus was created during the search that was conducted at a location related to BJP's Dubbak assembly seat by-poll candidate Raghunandan Rao.
Siddipet police say,"Rs 18.67 lakhs was seized of which BJP workers snatched over Rs 12 lakhs & ran away." #Telangana (26.10.20) pic.twitter.com/scfRY8OoK1
— ANI (@ANI) October 26, 2020
రాష్ట్ర అభివృద్ధిలో, నిధుల్లో తమ వాటా ఉందని బీజేపీ నేతలు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని తాము గట్టిగా తిప్పికొడితే.. ఇవాళ పోలీస్ అధికారులపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. డబ్బులు దొరికినట్లు పోలీసులు ఆధారాలు చూపిస్తే.. పోలీసులే డబ్బులు పెట్టారని ఉల్టా ప్రచారం చేస్తూ.. బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కోసం ఖర్చు పెట్టడానికి డబ్బు వచ్చిందని పోలీస్ అధికారులు చెబుతున్నారని, దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ రాచరిక, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, ఇందుకు సిద్దిపేట సంఘటనే నిదర్శనమన్నారు. ఫాంహౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం లాగానే మంత్రులు సైతం బరితెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్త కారులో డబ్బుపెట్టి రికవరీ అంటూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని, సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులు మహిళలు, చిన్నపిల్లల పట్ల సంస్కారహీనంగా వ్యవహరించారని ఆరోపించారు.
కాగా ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు. ఎంపీ కార్యాలయంలోనే దీక్షకు ఉపక్రమించిన సంజయ్, రాత్రి నేలపై పడుకొని తన నిరసనను తెలిపారు. సంజయ్ దీక్షకు సంఘీభావంగా బయట కార్యకర్తలు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. సిద్దిపేటలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు, ఆయన వారి బంధువుల ఇళ్లలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించారని, పోలీసులు డబ్బులు పెట్టి దొరికినట్లు చూపించారని ఆరోపించారు. ఇక రెచ్చగొట్టే చర్యలకు దిగినా, కార్యకర్తలు సమన్వయం పాటించి దుబ్బాక నియోజకవర్గంలోని బూత్ లెవల్ కార్యకర్తలు యథావిధిగా ప్రచారం కొనసాగించాలని సంజయ్ కోరారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఛలో ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ నేతలు పిలునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాజసింగ్, మోత్కుపల్లి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బయటకు వెళ్ళటానికి వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు.