Hyderabad, July 31: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో వైద్యులు ఈటలకు చికిత్స (Etela Rajender Health Update) అందిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ పరామర్శించారు.
కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్ అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయనకు ఆక్సిజన్, బీపీ స్థాయిలు పడిపోయినట్లు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే ఈటల రాజేందర్‌ను హైదరాబాద్ తరలించారు. ఈటల అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన ప్రజాదీవెన పాదయాత్రకు (Praja Deevena Padayatra) బ్రేక్ పడింది.హుజురాబాద్ ఉపఎన్నికలో(Huzurabad assembly constituency Bypoll) భాగంగా ప్రజాదీవెన యాత్రలో భాగంగా వీణవంక మండ లం పోతిరెడ్డిపల్లికి శుక్రవారం చేరుకున్నారు. అక్కడి నుంచి కొండపాక చేరకుని సభలో మాట్లాడిన అనంతరం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు.
అక్కడే ఉన్న ప్రత్యేక బస్సులో వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ 90/60, షుగర్ 265 ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆక్సిజన్ స్థాయి లు 94లోపు ఉండటంతో ప్రాథమిక వైద్యం అందించారు. ర్యాపిడ్ టెస్టు చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది.
మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించగా, జ్వరం తగ్గింది. ముందుగా హైదరాబాద్ నిమ్స్‌కు ఈటలను తరలిస్తారని ప్రకటించగా, అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో రాత్రి 7.30 గంటలకు హుజూరాబాద్‌లోని తన కార్యాలయానికి తరలించారు. తాజాగా ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ నెల 19న కమలాపూర్ మండలంలో యాత్ర ప్రారంభించగా, 222 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. కొండపాకలో నిలిచిన పాదయాత్రను ఈటల సతీమణి జమునారెడ్డి హిమ్మత్‌నగర్ వరకు కొనసాగించారు. ప్రజలు ఈటల కోసం ఎదురు చూస్తున్నారనే ఉద్దేశంతో ఆమె యాత్రను చేపట్టారు.