Telangana Director of Public Health, Srinivasa Rao (Photo-ANI)

Hyd, August 30: ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చికిత్సలు (Family planning surgery) వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాత (four women dies in Ibrahimpatnam) పడ్డారు.ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో బైఠాయించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సుష్మ మృతదేహన్ని అంబులెన్స్‌లో ఉంచి ఆందోళనకు దిగారు.

మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు వీరికి మద్దతుగా నిలిచారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్వలక్ష్మిని చుట్టుముట్టి నిలదీశారు.

ఆందోళన చేస్తున్న వారికి ఆర్డీఓ వెంకటాచారి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించినా ససేమిరా అనడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆర్డీఓ విషయాన్ని ఫోన్‌ద్వారా కలెక్టర్‌కు విన్నవించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇస్తామని, పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించారు.

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, 48,816 మంది విద్యార్థులు పాస్‌, tsbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ రవీందర్‌ నాయక్‌ తెలిపారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని డిప్యూటీ డీహెంహెచ్‌ఓ నాగజ్యోతితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 25న డీపీఎల్‌ క్యాంపులో 34 మందికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. వీరిలో నలుగురికి మాత్రమే ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. వీరిలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.

ఇబ్రహీంపట్నం ఘటన దురదృష్టకరం : డీహెచ్‌ శ్రీనివాసరావు

ఇబ్రహీంపట్నం సివిల్‌ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వికటించి. నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు (dh srinivasa rao) స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు. అనుభవం ఉన్న సర్జన్‌తోనే 34 ఆపరేషన్లు చేశారని పేర్కొన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న వారంతా కొద్ది గంటలే ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో అనుభవజ్ఞుడైన వైద్యుడి ఆధ్వర్యంలో ఆపరేషన్లు జరిగాయని చెప్పారు.

ఆపరేషన్‌ చేయించుకున్న వారంతా కొద్ది గంటలే ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని.. ఆపరేషన్లు పూర్తి అయిన అనంతరం మహిళందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ఇండ్లకు పంపించడం జరిగిందన్నారు. ఆ తర్వాత మహిళలు 26, 27 తేదీల్లో గ్యాస్ట్రో లక్షణాలపై ఫిర్యాదు చేశారన్నారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించడం, అలాగే ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం జరిగిందన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న 34 మందిలో నలుగురు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇది బాధాకరమైన విషయమన్నారు.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు జరగడం మొదటిసారన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నామన్నారు. ఘటనపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ మంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నారన్నారు. అయితే, మృతి చెందిన నలుగురిని కాజ్‌ ఆఫ్‌ డెత్‌ కోసం నలుగురికి పోస్టుమార్టం నిర్వహించినట్లు చెప్పారు. తద్వారా మరణానికి కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం ముఖ్యమన్నారు. మిగతా 30 మందిని నిన్న నుంచి స్క్రీనింగ్‌ చేస్తున్నామని, ఇండ్లకు ప్రత్యేక బృందాలను పంపి.. ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

30 మందిలో సోమవారం అర్ధరాత్రి ఏడుగురిని హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించామన్నారు. మరో ఇద్దరు మహిళలను నిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియ అన్నారు. కు.ని. ఆపరేషన్లు తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమన్నారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమం 70 సంవత్సరాల కిందట ప్రారంభమైందన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూలై వరకు పబ్లిక్‌ సెక్టార్‌లో 16,147 ట్యూబెక్టమీ, ప్రైవేటు సెక్టార్‌లో 16,077 ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందన్నారు.

మొత్తం 38,656 ఆపరేషన్లు జరుగుతుందన్నారు. ఇబ్రహీంపట్నం ఘటనపై ప్రభుత్వం పారదర్శకమైన విచారణ కోసం కమిటీని నియమించిందన్నారు. కమిటీకి విచారణ అధికారి డైరెక్టర్‌ హెల్త్‌ను నియమించిందని చెప్పారు. రాబోయే వారం రోజుల్లో అన్ని కోణాల్లో నిష్పాక్షపాతంగా విచారణ జరిపి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇబ్రహీంపట్నం ఆసుపత్రిని తక్షణమే సస్పెన్షన్‌ చేశామన్నారు. సర్జరీ చేసిన వైద్యుడి లెసెన్స్‌ను తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ తాత్కాలికంగా రద్దు చేసిందని వివరించారు. వీళ్లే తప్పు చేశారని కాకుండా.. దర్యాప్తులో ఆటంకం కలుగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని, అలాగే డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.