Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, May 13: రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంట పెట్టుబడి సాయంగా 'రైతుబంధు' పథకం ద్వారా అందించే నిధులపై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం చెప్పిన పంటలు పండించే రైతులకే రైతుబంధు పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం చెప్పిన పంటలకే మద్ధతు ధర లభిస్తుందని కూడా సమీక్షలో ఆయన స్పష్టం చేశారు.

రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో 'నియంత్రిత' పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరి పంట సాగు ఈ వర్షాకాలంలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలను చర్చించేందుకు ఈనెల 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడాలని సీఎం నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కార్యాలయం వెలువరించిన ప్రకటన ప్రకారం.. ‘‘అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే నానుడి రాష్ట్రంలో, దేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. పండించిన పంట అమ్ముదామంటే అమ్ముడుపోదు, కావాల్సిన వస్తువులు కొందామంటే విపరీతమైన ధరలు ఉంటాయి. ప్రస్తుతం సేవారంగం, ఐటి రంగం, కొత్త వృత్తులు ఈ మధ్య వచ్చినవి. గతంలో అంతా వ్యవసాయమే. నేరుగా పంటలు పండించే రైతులు, అందులో పనిచేసే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ఉండే వారు ఇలా సమాజంలో 90-95 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికిన వారే. మన రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం, దేశం వ్యవసాయక దేశం. దేశంలో ఒకప్పుడు తీవ్రమైన కరువు ఉండేది. కీలకనామ సంవత్సరంలో అయితే విపరీతమైన ఆహార కొరత కూడా ఏర్పడింది. తొండల్లాగా బతకాల్సి వచ్చింది. ఈ తర్వాత అనేక పరిణామాలు మారాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ది సాధించాం. ఆహార కొరత లేకుండా అయింది. తర్వాత పరిణామాల్లో రైతు పండించిన పంటకు మంచి ధర రావడం లేదు.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ రైతులు పండించిన పంటలకు గౌరవ ప్రదమైన ధరలు రావాలంటే ఏం జరగాలి? అని మనం ఆలోచించుకోవాలి. గతం మాదిరిగానే ప్రభుత్వం ప్రేక్షక వహించి మౌనంగా ఉండాలా? మార్పు కోసం ప్రయత్నించాలా? దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు భారతదేశాన్ని పాలించిన ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం కూడా వ్యవసాయంపై చిత్తశుద్ధితో పనిచేయలేదు. తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిలో మార్పు తేవడం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చేస్తున్నది.

రాష్ట్రంలో గతంలో వ్యవసాయం పరిస్థితి వేరు, ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి వేరు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ది – రైతు సంక్షేమం కోసం కంకణబద్ధమై పనిచేస్తున్నది. ప్రపంచమే తెలంగాణ నుంచి నేర్చుకోవాలని అభిలషిస్తున్నది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం అందరూ ఒకే రకమైన పంటలు పండించడం. మార్కెట్ డిమాండుకు తగ్గట్లు పంటలు పండించాలని నేను ఇవాళ చెప్పడం లేదు. 20 ఏళ్ల క్రితం నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేసినప్పటి నుంచి చెబుతున్నా. ప్రధాని నరేంద్ర మోడికి, గత వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు పంటల మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటు గురించి అనేక మార్లు చెప్పాను. ఇంతకు మించిన గత్యంతరం లేదు. అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి’’ అని సీఎం అన్నారు.

‘‘ఏది పడితే అది పండించి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి, పండిన పంటలు మార్కెట్ కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దు. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలి. అమ్ముడుపోయే సరుకే పండించాలి. రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే పూనుకుని చెబుతున్నది. ఆ పంటలకు మద్దతు ధర ఇస్తామని చెబుతున్నది. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకుండాలి. రైతుల ఆలోచనలో మార్పు రావాలి. నిర్మాణాత్మకమైన మార్పులు రావాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

ఈ వర్షాకాలంలో వరిపంటతో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే పద్ధతి ప్రారంభం కావాలని మంగళవారం జరిగిన వ్యవసాయ సమీక్షలో నిర్ణయించారు. రాష్ట్రంలో ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించారు. ఇందులో సన్న, దొడ్డు రకాలుండాలని తేల్చారు. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుంది. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని, ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలనే నిర్ణయం జరిగింది.

ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని నిర్ణయించారు. ఏ పంట ఎక్కడ పండించాలి? ఎంత పండించాలి? అనే వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడిస్తారు.

పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రాంతంలో ఎంత మేరకు కూరగాయలు పండించాలి? ఏ కూరగాయలు పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలు కూడా రైతులకు ప్రభుత్వం సూచిస్తుంది.

సీడ్ రెగ్యులేటింగ్ అథారిటి ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలనే సాగు చేయాలని నిర్ణయించినందున, ఇకపై విత్తనాలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి మాత్రమే అమ్మాలి. దీనిపై విత్తన తయారీ సంస్థలకు, వ్యాపారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే లభ్యమయ్యేలా విత్తన నియంత్రణ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ఇప్పుడున్న విత్తన చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీడ్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగ సమావేశం కావాలని సిఎం నిర్ణయించారు.

కల్తీ, నకిలీలపై ఉక్కుపాదం

• నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి, మిర్చి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది. బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యటిస్తాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టాయి. నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేసే వారిని, అమ్మే వారిని వెంటనే గుర్తించి, పిడి యాక్టు కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా పత్తి, మిరప విత్తనాలు నకిలీవి ఎక్కువగా అమ్మే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం వాటి నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నది.

• సమగ్ర వ్యవసాయ విధానానికి అనుగుణంగా వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యూనివర్సిటీలో తెలంగాణలో పండించాల్సిన పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కువగా జరగాలని ఆదేశించింది. రైతుబంధు సమితిలు క్రియాశీలకంగా మారి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో రైతులను సమన్వయ పరచాలని కోరింది.

• రాష్ట్రంలో గోదాముల నిర్వహణ అంతా సులభంగా, ఏకోన్ముఖంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది.

• మార్కెటింగ్ శాఖను కూడా తెలంగాణలో అమలయ్యే వ్యవసాయ విధానానికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది.

• తెలంగాణలో పెద్ద ఎత్తున వరి పండుతుంది. ఆ వరిని బియ్యంగా మార్చడం కోసం రాష్ట్రంలో రైసు మిల్లుల సామర్ధ్యం బాగా పెరగాల్సి ఉంది. ఇందుకోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే రైస్ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు.

15న క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధానంపై చర్చించేందుకు, తగు సూచనలు చేసేందుకు ఈ నెల 15న మద్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఎడిఎ, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి, ఎఇవోలు, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు, గ్రామాల రైతు బంధు సమితిల అధ్యక్షులు పాల్గొంటారు.