Hyderabad, October 11: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర రోడ్లపై కార్లు బీభత్సం సృష్టించాయి. మద్యంమత్తులో నిరక్షంగా అత్యంత వేగంతో కార్లు నడపడంతో రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. ఐటీకీ కేరాఫ్ అడ్రస్ అయిన మాదాపూర్‌లో ఓ ఫెరారీ కారు బీభత్సం (Ferrari Car Accident) సృష్టించింది. కారు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణాం గాలిలో కలిసిపోయింది. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ గౌడ్(29).. శంకర్ ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన యజమానిని ఎక్కించుకుని మాదాపూర్ (Hyderabad's Madhapur) నుంచి కూకట్‌పల్లికి టీఎస్08 ఎఫ్‌పీ 9999 నెంబర్ గల ఫెరారీ కారులో బయల్దేరారు.
అతివేగంగా కారును నడపడంతో అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఏసుబాబు(50) కారు కిందపడి (Madhapur road accident) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు ఢీకొనడంతో షేక్ జమీల్ అనే మరో వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ నవీన్ కుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా తూర్పుగోదావరి జిల్లా చెబ్రోన్ గ్రామానికి చెందిన ఏసుబాబు(50) బతుకుదెరువు కోసం భార్య మార్తమ్మ, కొడుకు కుమార్, ఇద్దరు కుమార్తెలతో కలిసి నగరానికి వచ్చాడు. ఐటీ కారిడార్ గుట్టలబేగంపేటలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. కారు ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయాడు.
స్థానికులు, కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఏసుబాబు కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించవద్దని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద సంఖ్యలో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మృతదేహం తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు. ఏసుబాబు మరణంతో తాము ఆధారం కోల్పోయామంటూ ఏసుబాబు కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
మరో ఘటనలో కొత్తపేట రైతుబజార్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తి.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. స్థానికంగా నివసించే పోలయ్య ఫిష్ స్టాల్‌లో పని చేస్తుంటాడు. ఆదివారం రాత్రి నీటి కోసం రైతు బజార్ వద్ద రోడ్డు దాటుతుండగా దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కారు డైవ్రర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రాంపల్లికి చెందిన విద్యార్థులు పునీత్(24), అగ్రజ్(21) ద్విచక్రవాహనంపై బోయిన్‌పల్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. బోడుప్పల్‌కు చెందిన అఖిల్(23) మద్యం మత్తులో కారు నడుపుతూ మారేడుపల్లి కస్తూర్బా గాంధీ కళాశాల రోడ్డులో జెండా దిమ్మెను, ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో పునీత్ కాలు విరిగింది. అగ్రజ్ తలకు గాయాలై పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా దూసుకెళ్లిన కారు మరో రెండు కార్లను, ఓ ప్రహరీని ఢీ కొట్టి ఆగింది. అఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి కార్వాన్‌కు చెందిన మేఘా నవేందర్, రష్మీ ద్విచక్ర వాహనంపై వెళుతూ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ ప్రాంతంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి తీవ్ర గాయాలపాలయ్యారు. పంజాగుట్ట డీఐ నాగయ్య, సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు.
ట్యాంక్ బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. అతి వేగంగా వస్తున్న నిసాన్ కారు (Nissan Car Accident) ఎన్టీఆర్ గార్డెన్ వద్దకు రాగానే పల్టీ కొట్టడంతో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచుకుంది. కారులో ఉన్న వారంత స్వల్ప గాయాలతో భయటపడ్డారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసలు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం క్రేన్ సహాయంతో కారును పక్కకు తొలగించారు.